ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా ఇవాళ జరగాల్సిన పాకిస్తాన్-బంగ్లాదేశ్(PAK vs BAN) మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా టాస్ కూడా పడలేదు. ఎంతసేపటికీ వరుణుడు కరుణించకపోవడంతో అంఫైర్లు మ్యాచ్ రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే ఇప్పటికే ఈ రెండు జట్లు సెమీస్ రేస్ తప్పుకుని ఇంటికి నిష్క్రమించాయి. చివరి మ్యాచ్ అయినా గెలిచి తమ దేశ అభిమానులకు కాస్త ఊరట కలిగిద్దామనుకున్నా వర్షం రూపంలో అడ్డంకి వచ్చింది.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ICC టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ గ్రూప్ Aలో అట్టడుగున నిలిచింది. కరాచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి, దాయాది దేశమైన భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసిందతి. ఇక బంగ్లాదేశ్ జట్టు కూడా భారత్, న్యూజిలాండ్ జట్ల చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఈ రెండు జట్లు ఒక్క విజయం కూడా లేకుండానే టోర్నీ నుంచి వైదొలిగాయి.