క్రీడారంగానికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం పాటి గ్రామంలో ఏర్పాటు చేసిన పాటి క్రికెట్ ట్రోఫీ ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు వేదికగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మినీ స్టేడియాలు నిర్మించడంతో పాటు, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పటాన్చెరు పట్టణంలో 7 కోట్ల 50 లక్షల రూపాయలతో మైత్రి మైదానాన్ని ఆధునికరించడంతో పాటు, పాటి గ్రామ పరిధిలో 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మినీ స్టేడియం నిర్మిస్తున్నామని తెలిపారు.
విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విజేత జట్టుకు, రన్నరప్ జట్లకు లక్ష రూపాయల సొంత నిధులను ప్రైజ్ బహుమతి రూపంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు లక్ష్మణ్, స్వామి గౌడ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.