Ramiz Raja : భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌తో టీమ్ఇండియా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు. ఐసీసీ ఈవెంట్లలలో తటస్థ వేదికలపైనే పాక్ జట్టుతో భారత్ తలపడుతోంది. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఆసియాకప్‌లో భారత్ పాల్గొనడంపై చర్చ జరుగుతూనే ఉంది.
ఇప్పటికే బీసీసీఐలోని పలువురు పెద్దలు ఈ విషయంపై స్పష్టత నిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్‌లో భారత్ ఆడేది లేదని చెప్పారు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా స్పందించాడు. తమ దేశంలో టీమ్ఇండియా ఆడకపోతే తదుపరి ఎలాంటి పరిణాలు ఉంటాయో వివరించే ప్రయత్నం చేశాడు. ఒకవేళ భారత జట్టు పాక్‌లో జరిగే ఆసియా కప్‌లో ఆడకపోతే.. 2023లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టు ఆడదని తెలిపాడు.
గత కొంతకాలంగా పాక్ జట్టు అత్యుత్తమంగా రాణిస్తోందని, ఏడాది కాలంలో టీమ్ఇండియాను రెండు సార్లు ఓడించామని రమీజ్ రజా గుర్తు చేశారు. మా జట్టు పటిష్టంగా మారింది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుందని అన్నాడు. “మేం చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. వాళ్లు(భారత్) ఇక్కడికి వస్తే.. మేం ప్రపంచకప్ ఆడటానికి వెలుతాం. వాళ్లు రాకపోతే.. మేమూ వెళ్లం. మా జట్టు ప్రపంచకప్ ఆడకుంటే ఆటను ఎవరు చూస్తారు.” అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమీజ్ రాజా అన్నాడు.
దీనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. భారత్ గనుక పాక్ కు వెళ్లకుంటే ఆసియా కప్ క్రేజ్ పడిపోవడం ఖాయమని అంటున్నారు. పాక్ ఒకవేళ ప్రపంచకప్ ఆడకుంటే ఆ దేశానికే నష్టం అని చెబుతున్నారు. ఐసీసీ టోర్నీలో పాల్గొనడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పాక్ కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇక ఇండియా కూడా ఏడాది కాలంలో రెండు సార్లు పాక్ ను ఓడించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.