ఇండియా గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రో వీరుడు నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఖతర్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్‌లో చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లోనే తొలిసారిగా జావెలిన్ త్రోలో 90 మీటర్ల మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించినందుకు ప్రధాని మోదీ(PM Modi) నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు.
‘అద్భుతమైన ఫీట్! దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు నీరజ్ చోప్రాకు అభినందనలు. ఇది అతని అవిశ్రాంత అంకితభావం, క్రమశిక్షణ ఫలితం. ఈ ప్రదర్శనతో భారతదేశం గర్విస్తోంది’ అనిపోస్ట్ చేశారు.
దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ చోప్రా 90.23 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. అయినా కానీ రెండో స్థానంలోనే నిలిచాడు. జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ 91.06 మీటర్ల దూరంతో తొలి స్థానంలో ఉన్నాడు. కాగా 2020 ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లతో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. ఇక 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 88.17 మీటర్లతో విజేతగా నిలిచాడు. ఇప్పటివరకు 89.94 మీటర్లు ఉత్తమ ప్రదర్శనతో ఉన్న నీరజ్.. దోహా డైమండ్ లీగ్‌లో 90.23 మీటర్లతో తాజా రికార్డును నెలకొల్పాడు.


