Cristiano Ronaldo: బ్రెజిల్ సాకర్ సంచలనం నెయ్‌మార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన వేళ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి ఇప్పుడు మరో దిగ్గజ ఆటగాడిపై పడింది. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) రిటైర్మెంట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. అయితే అభిమానులు ఊహించినట్లే 41 ఏళ్ల రొనాల్డో రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ ప్రిక్వార్టర్స్‌లో భాగంగా ఇవాళ అర్ధరాత్రి స్పెయిన్‌తో పోర్చుగల్ (Portugal Vs Spain) తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రొనాల్డో తన మనసులోని మాటను పంచుకున్నాడు.
100 శాతం కాదు.. 1000 శాతంతో మనస్ఫూర్తిగా చెబుతున్నా: స్పెయిన్‌తో జరగబోయే నాకౌట్ మ్యాచ్‌పై రొనాల్డో మాట్లాడుతూ.. ఇది తనకు చివరి ప్రపంచకప్ అని స్పష్టం చేశాడు. “ఆటను ఎంతవరకు ఆస్వాదించామనేదే ముఖ్యం. ఇదే నా చివరి వరల్డ్ కప్ (FIFA World Cup 2026). అయితే, స్పెయిన్‌తో మ్యాచ్ నాకు చివరిది కాకూడదని అనుకుంటున్నా (పోర్చుగల్ గెలవాలని ఆకాంక్షిస్తూ). ఏదో ఒక రోజు ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వస్తుంది. అందులో నేను నిజాయతీగా ఉంటా. రేపు ఏం జరిగినా.. ప్రశాంతంగా అక్కడి నుంచి నిష్క్రమిస్తా. అది 100 శాతం కాదు.. 1000 శాతంతో మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఫుట్‌బాల్ కోసం నాకు చేతనైనంత వరకూ చేశా” అని రొనాల్డో భావోద్వేగానికి లోనయ్యాడు.
Also read-Football: బ్రెజిల్‌కు ఊహించని పరాజయం.. రిటైర్మెంట్ ప్రకటించిన నెయ్‌మార్
విమర్శకులకు థాంక్స్ చెప్పిన రొనాల్డో: ఈ ప్రపంచకప్‌లో తన ప్రదర్శన మరియు తనపై వస్తున్న విమర్శలపై రొనాల్డో ఘాటుగానే స్పందించాడు. “ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్‌లో మూడు గోల్స్ చేశా. అదేమంత చెత్త ప్రదర్శనైతే కాదు. నా జీవితంలో దేనికీ కొరతలేదు. అన్నింటినీ సాధించా.. ఈసారి కూడా కప్‌తో టోర్నీని ముగించేందుకు శ్రమిస్తాం” అని తెలిపాడు. “41 ఏళ్లు వచ్చినా సరే నా ఆటతీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా వారందరికీ నేను థాంక్స్ చెబుతున్నా. విమర్శలు నన్ను వ్యక్తిగా మరింత మెరుగుపరిచాయి. మరో నలభై ఏళ్లైనా సరే ఇలాంటి వాటితో నేను బతికేస్తా’’ అని ధీమా వ్యక్తం చేశాడు. 2030 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను పోర్చుగల్, స్పెయిన్, మొరాకో దేశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందే రొనాల్డో తన చివరి ప్రపంచకప్ ఆడుతుండటంతో ఇవాళ అర్ధరాత్రి స్పెయిన్‌తో జరగబోయే మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

