ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ఘోరంగా ఇంటి బాట పట్టిన సంగతి తెలిసిందే. ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అందులోనూ చిరకాల ప్రత్యర్థి అయిన భారత జట్టుతో ఓడిపోవడం వారిని మరింత నిరాశపర్చింది. ఇదిలా ఉండగానే ఐపీఎల్(IPL)కు పోటీగా పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2025)పదో ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 11న ప్రారంభం కానున్న ఈ టోర్నీ మే 18న ముగుస్తుంది. ఐపీఎల్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరుగుతుంది.
ఇక టోర్నీ తొలి మ్యాచ్ లాహోర్ ఖలందర్స్- ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య జరగనుంది. రావల్పిండి స్టేడియం క్వాలిఫైయర్ 1తో సహా టోర్నమెంట్‌లోని 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. లాహోర్‌లోని ఐకానిక్ గడాఫీ స్టేడియంలో ఫైనల్, ఎలిమినేటర్స్ సహా మొత్తం 13 మ్యాచ్ లు జరుగుతాయి. కరాచీలోని నేషనల్ స్టేడియం, ముల్తాన్ స్టేడియం చెరో ఐదు మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్,పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్,కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి.
