Saturday, November 15, 2025
HomeఆటQuinton de Kock: క్వింటన్‌ డికాక్‌ రీఎంట్రీ.. రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకున్న స్టార్‌ బ్యాట్స్‌మెన్‌..!

Quinton de Kock: క్వింటన్‌ డికాక్‌ రీఎంట్రీ.. రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకున్న స్టార్‌ బ్యాట్స్‌మెన్‌..!

Quinton de Kock Re entry in South africa Team: సౌతాఫ్రికా స్టార్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్ క్వింటన్ డికాక్.. తన రిటైర్మెంట్‌ ప్రకటనపై యూటర్న్ తీసుకున్నాడు. 2023లో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ 32 ఏళ్ల స్టార్‌ బ్యాట్స్‌మెన్‌.. తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే పాకిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా టీ20 జట్టులోనూ ఏడాది తర్వాత చోటు దక్కించుకున్నాడు. డికాక్.. వన్డే ప్రపంచకప్ 2023లో చివరిసారిగా దక్షిణాఫ్రికా తరఫున వన్డే మ్యాచ్ ఆడాడు. కాగా, 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం డికాక్ 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతను కేవలం టీ20 ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే, 2027లో తమ స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని డికాక్‌ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ టూర్‌కు ముందు నమీబియాతో జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌లో కూడా డికాక్ ఆడనున్నాడు. డికాక్ రీఎంట్రీపై దక్షిణాఫ్రికా కోచ్ కాన్రాడ్ హర్షం వ్యక్తం చేశారు. డికాక్‌ రీఎంట్రీపై మాట్లాడుతూ.. “క్వింటన్ మళ్లీ వైట్-బాల్ క్రికెట్ ఆడటానికి ముందుకు రావడం మా జట్టుకు పెద్ద బూస్ట్‌ లాంటింది. అతని భవిష్యత్ ప్రణాళికల గురించి గత నెలలో మేం చర్చించాం. దేశం తరఫున ఆడాలనే బలమైన ఆకాంక్ష అతనిలో ఇంకా ఉందని అప్పుడే స్పష్టమైంది. అతని నైపుణ్యం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది” అని కాన్రాడ్ ఆనందం వ్యక్తం చేశాడు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/power-star-og-mania-everywhere/

రీఎంట్రీపై అప్పట్లోనే సంకేతాలు..

నిజానికి, రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలోనే డికాక్ భవిష్యత్తులో తిరిగి వచ్చే అవకాశం ఉందనే పరోక్ష సంకేతాలిచ్చాడు. “ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. కానీ జీవితంలో విచిత్రమైనవి జరుగుతుంటాయి. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు” అని అతను అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అదే నిజమైంది. అతని రాకతో 2026 టీ20 ప్రపంచకప్, 2027 వన్డే ప్రపంచకప్‌లకు దక్షిణాఫ్రికా జట్టు మరింత పటిష్టంగా మారనుంది. దక్షిణాఫ్రికా తరఫున 155 వన్డేలు ఆడిన డికాక్‌.. ఇప్పటి వరకు 45.74 సగటుతో 6,770 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు సైతం ఉన్నాయి. అదేవిధంగా, 92 టీ20 మ్యాచ్‌లలో 138కి పైగా స్ట్రైక్ రేట్‌తో 2,584 పరుగులు చేశాడు. అతని అనుభవం, దూకుడైన బ్యాటింగ్ రాబోయే టోర్నమెంట్లలో జట్టుకు కీలకం కానున్నాయి. కాగా, డికాక్ 2021లోనే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం రెండేళ్లకు వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. టీ20 ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్‌ చెప్పనప్పటికీ.. ఏడాది కాలంగా జట్టుకు ఎంపిక కాలేకపోయాడు. దీంతో గతేడాది అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా దక్కలేదు. కానీ తాజాగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న వెంటనే రెండు ఫార్మాట్లలో జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో డికాక్‌ మళ్లీ దక్షిణాఫ్రికా జట్టులోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad