Ajinkya Rahane: భారత క్రికెటర్ అజింక్య రహానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో ముంబై జట్టుని నడిపించిన రహానే ఇప్పుడు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ‘‘ముంబై జట్టుకు నాయకత్వం వహించడం, ట్రోఫీలను గెలవడం ఎప్పటికీ మరిచిపోలేను. అదొక గొప్ప గౌరవం. కొత్త సీజన్‌లో జట్టుకు కొత్త సారథి అవసరమని భావిస్తున్నా. కొత్త నాయకత్వంలో ముంబై జట్టు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నా. ప్లేయర్‌గా ఇంకా నా పూర్తిస్థాయి ప్రదర్శన ఇచ్చేందుకు నిరంతరం శ్రమిస్తా. ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మరిన్ని ట్రోఫీలు గెలిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. కొత్త సీజన్‌లో మరింత దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పోస్టు పెట్టాడు. అయితే, త్వరలోనే దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో రెహానే ఈ నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రహానే దూరమైనప్పటికీ.. డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుత ఫామ్ లో ఉన్నాడు.
Read Also: S Jaishankar: ఆ వాదనల్లో లాజిక్ లేదు.. అమెరికాపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు
ముంబైకి విజయాలు..
37 ఏళ్ల రహానె నాయకత్వంలో ముంబై అద్భుత విజయాలను నమోదు చేసింది. అదే సమయంలో కీలక మ్యాచుల్లోనూ తడబాటుకు గురైంది. ఇరానీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను రహానే నాయకత్వంలో ముంబయి గెలుచుకుంది. రంజీట్రోఫీ (2023-24) ఫైనల్‌లో విదర్భ చేతిలో ఓటమిని చవిచూసింది. ఇప్పటి వరకు రహానె 201 ఫస్ట్‌కాస్ల్ మ్యాచుల్లో 14వేలకుపైగా పరుగులు చేశాడు.
Read Also: EV Race Heats Up: హీటెక్కిన ఈవీ రేస్.. తొలిస్థానానికి ఎగబాకిన ఏథర్
యశస్వికా? శ్రేయస్‌కా?
మరోవైపు, ముంబై జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవేం లేదు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ సహా పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ఇప్పటికే శ్రేయస్, సూర్యకు ఐపీఎల్‌లో కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. టెస్టుల్లో యశస్వి జైస్వాల్ దూసుకుపోతున్నారు. వారిద్దరితో పోలిస్తే యశస్వి సుదీర్ఘ ఫార్మాట్‌లో మంచి ఇన్నింగ్స్‌లు నిర్మించగల సమర్థుడు. ఇటీవలే అతడు గోవా జట్టుకు ఆడదామనే ఆలోచనను కూడా విరమించుకున్నాడు. ఈ క్రమంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యశస్వికే జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం లేకపోలేదు. శ్రేయస్ అయ్యర్ కూడా గట్టిపోటీదారే.


