ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. యువ ఆటగాడు రజత్ పాటిదార్(Rajat Patidar)కు నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. స్టార్ ప్లేయర్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ కెప్టెన్సీ వైపు మొగ్గు చూపలేదు. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రజత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. గత సీజన్‌లలో ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈసారి జట్టును అతడిని రిటైన్ చేసుకోలేదు.
కాగా పాటిదార్ 2021 నుంచి ఆర్‌సీబీ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడి 34.7 సగటుతో 158.8 స్ట్రైక్‌రేటుతో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్థశతకాలు ఉన్నాయి. గతంలో 2024-2025 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్‌కు నాయకత్వం వహించాడు. గత 17 సీజన్లుగా ఐపీఎల్ టైటిల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అందని ద్రాక్షగానే ఉంది. మూడు సార్లు ఫైనల్ చేరినా కప్ అందుకోలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా ఐపీఎల్ విజేతగా నిలవాలని గట్టి పట్టుదలతో ఉంది. మరి పాటిదార్ నాయకత్వంలోనే కప్‌ను ముద్దాడుతుందో లేదో వేచి చూడాలి.