WPL 2026, MI vs RCB Highlights: WPL 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే అభిమానులకు అసలైన టీ20 మజా లభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన ఈ పోరులో ఆఖరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరకు ఆల్ రౌండర్ నడిన్ డి క్లర్క్ వీరోచిత పోరాటంతో ఆర్సీబీ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. బంతితో 4 కీలక వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లో 63 పరుగులు చేసి జట్టును గెలిపించిన క్లర్క్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
కుప్పకూలిన టాప్ ఆర్డర్..
టాస్ గెలిచిన స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. ముంబై స్టార్ ప్లేయర్లు అమేలియా కెర్ (4), నాట్ సివర్ బ్రంట్ (4), హర్మన్‌ప్రీత్ కౌర్ (20) విఫలమయ్యారు. 17 ఏళ్ల జి. కమలిని (32) కాసేపు పోరాడింది. ఒక దశలో కష్టాల్లో ఉన్న ముంబైని సంజీవన్ సజన (25 బంతుల్లో 45) మరియు నికోలా కేరీ (29 బంతుల్లో 40) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 49 బంతుల్లో 82 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్సీబీ బౌలర్లలో నడిన్ డి క్లర్క్ అద్భుతమైన స్పెల్‌తో ముంబై నడ్డి విరిచింది. ఆమె 4 ఓవర్లలో కేవలం 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. లారెన్ బెల్, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఉత్కంఠభరిత ఛేజింగ్..
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ప్రారంభంలోనే షాక్ తగిలింది. 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని నడిన్ డి క్లర్క్ ఆదుకుంది. చివరి వరకు నిలిచి కేవలం 44 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది. ఆమెకు అరుంధతి రెడ్డి(20) చక్కని సహకారం అందించింది. వీరిద్దరూ 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరి బంతి వరకు సాగిన ఈ థ్రిల్లర్‌లో ఆర్సీబీ విజయం సాధించి టోర్నీని ఘనంగా ప్రారంభించింది.
Also Read: Tilak Varma -వరల్డ్ కప్ కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో తిలక్ వర్మ దూరం!
గ్రాండ్ ఓపెనింగ్
మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రారంభ వేడుకలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. హనీ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు హర్నాజ్ సంధు తమ ప్రదర్శనలతో వేదికను హోరెత్తించారు.
ప్లేయింగ్ XI (Playing XI):
RCB-W: స్మృతి మంధాన (కెప్టెన్), గ్రేస్ హారిస్, దయాలన్ హేమలత, రిచా ఘోష్, రాధా యాదవ్, నడిన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ప్రేమా రావత్, లిన్సే స్మిత్, లారెన్ బెల్.
MI-W: నాట్ సివర్ బ్రంట్, జి కమలిని, అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, నికోలా కేరీ, పూనమ్ ఖేమ్నార్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజీవన్ సజన, సైకా ఇషాక్.

