RCB vs MI IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చివరి వరకూ జరిగిన హోరాహోరీ పోరులో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా చివరి ఓవర్ నరాలు తెగేలా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బాల్‌కి 2 పరుగులు కావాల్సి ఉండగా.. ఆ పరుగులు పూర్తి చేసిన భువనేశ్వర్, రసిఖ్ సలాం జట్టుకి విజయాన్ని అందించారు. మొత్తంగా 2 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. ఈ మ్యాచ్ ఫలితంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మొదటి స్థానానికి ఎగబాకింది.
Also Read: https://teluguprabha.net/sports-news/chennai-super-kings-beat-lucknow-supergiants-by-5-wickets/
రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా.. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కి దిగిన ముంబై జట్టుకి ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. రోహిత్ శర్మ 22(10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి క్రీజులో ఉండగా ఔట్ అవ్వడంతో చిక్కుల్లో పడింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్, ర్యాన్ రికెల్టన్(2) విఫలం కావడంతో భారీ స్కోరు అంచనాలు తారుమారయ్యాయి. అయితే నమన్ ధీర్ 47(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ 57(42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. హాజిల్ వుడ్, రసిఖ్ సలాం, షెఫర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
167 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభం నుంచే తడబడుతూ వచ్చింది. ఓపెనర్ విరాట్ కోహ్లీతో పాటు మరో కీలక బ్యాటర్ టిమ్ డేవిడ్ డకౌట్‌తో వెనుదిరగడంతో గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. బెథెల్(27), దేవదత్ పడక్కల్(12), జితేశ్ శర్మ(18) పరుగులతో రాణించారు. అయితే కృనాల్ పాండ్యా 73(46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులతో క్రీజులో నిలదొక్కుకుని భారీ షాట్లు ఆడుతూ గెలుపు దిశగా కీలక యత్నం చేశాడు. కానీ, తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మ్యాచ్ మళ్లీ ముంబై వైపు మళ్లింది. షెఫర్డ్(4) నిరాశపరిచినా.. చివరి ఓవర్‌లో రసిఖ్ సలాం 3(2), భువనేశ్వర్ కుమార్ 7(2) అద్భుతమైన కోఆర్డినేషన్‌తో ఆర్సీబీ విజయం దిశగా దూసుకెళ్లింది. లాస్ట్ 3 బంతుల్లో 9 పరుగులు కావాల్సి ఉండగా.. భువీ భారీ సిక్సర్‌తో సూపర్ ఓవర్ అంచనాలను తీసుకొచ్చాడు. అయితే చివరి బంతికి 2 పరుగులను చేయడంతో గెలుపు ఖరారైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన బెంగళూరు 167 పరుగులు చేసి గెలుపొందింది. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 4 వికెట్లు తీశాడు. చాహర్ 2 వికెట్లు, ఘజన్‌ఫర్, రాజ్ బవా తలో వికెట్ తీశారు.

