Bronco Test: టీమిండియా ప్లేయర్లకు గుడ్ న్యూస్. అయితే, ఈ శుభవార్త మాత్రం అధికారికంగా రాలేదు కానీ, జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పలు రిపోర్టుల ప్రకారం భారత క్రికెటర్లకు బ్రాంకో టెస్టు నుంచి ఉపశమనం లభించినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటివరకు యోయో టెస్టుతోపాటు బ్రాంకో టెస్టులోనూ పాస్ కావాల్సిందేనని పట్టుబట్టిన బీసీసీఐ ఇప్పుడు కాస్త వెనకడుగు వేసింది. రగ్బీ ఆటగాళ్ల కోసం అమల్లో ఉన్న ఇలాంటి విధానాన్ని మన క్రికెటర్లకు ఆపాదించడం సరైంది కాదనే విమర్శలూ వచ్చాయి. సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మను బయటకు పంపేందుకే ఇలాంటి టెస్టును తీసుకొచ్చారంటూ కామెంట్లూ వినిపించాయి. దీంతో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ఎప్పట్లాగే ఫిట్‌నెస్ టెస్టులను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ‘‘ఆసియా కప్ కోసం భారత జట్టు నాలుగో తేదీ ఉదయం దుబాయ్‌కు బయల్దేరనుంది. ప్లేయర్లు అందరూ అక్కడే కలుసుకుంటారు. ఐసీసీ అకాడమీలో 5వ తేదీన తొలి ప్రాక్టీస్ సెషన్ జరగనుంది. ఒకవేళ అప్పటికీ మేనేజ్‌మెంట్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ బ్రాంకో టెస్టుతోనే ఫిట్‌నెస్ అంచనా వేయాలని భావిస్తే దుబాయ్‌లోనే నిర్వహించే అవకాశం లేకపోలేదు. అయితే, బ్రాంకో టెస్టుపై ఇప్పటికే వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో దాన్ని అమలు చేయకపోవచ్చు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Read Also: Xi Jinping: శాంతా-యుద్ధమా? చర్చలా-ఘర్షణా? జిన్ పింగ్ సంచలన వ్యాఖ్యలు
విధానాలు మారుతూంటాయి- సోహమ్ దేశాయ్
ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి అంచనా వేయడానికి కాలంతోపాటు విధానాలూ మారుతుంటాయని స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ మాజీ కోచ్ సోహమ్ దేశాయ్ వెల్లడించారు. ఈ టెస్టులేవీ జట్టు ఎంపికకు ప్రమాణం కాదని స్పష్టంచేశారు. ‘‘విరాట్ కోహ్లీ – రవిశాస్త్రి సమయంలో శంకర్ బసు మార్గదర్శకంలో 2019 వరల్డ్ కప్ కోసం ఫిట్‌నెస్ లెవల్‌ను తీసుకొచ్చారు. అందరి ఆమోదంతోనే అమలు చేశారు. ప్రతిఒక్క క్రికెటర్ ఇదే విధానంలో ఫిట్‌నెస్ నిరూపించుకొని వరల్డ్ కప్‌లో ఆడించారు. ఆ తర్వాత యోయో టెస్టు ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి విరివిగా వినియోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం మూడుసార్లు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఇది జట్టు సెలక్షన్‌కు ప్రామాణికం కాదు. ఇదంతా ఆటగాళ్ల ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికే మాత్రమే’’ అని సోహమ్ తెలిపారు. ఇకపోతే , ఈసారి ఆసియా కప్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. యూఏఈ, పాకిస్థాన్, ఒమన్‌లతో తలపడనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. 14న దాయాది పాక్‌తో, 19న ఒమన్‌తో ఆడనుంది. మరోవైపు, ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా కష్టపడుతున్నారు.
Read Also: Virat Kohli: బెంగళూరు తొక్కిసలాట.. 91 రోజుల తర్వాత స్పందించిన కోహ్లీ


