ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి ఐపీఎల్ 2025లో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ యువ కెప్టెన్ రియాన్ పరాగ్ సిక్సర్ల సునామి సృష్టించాడు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో.. పరాగ్ సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సులు బాదుతూ, స్టేడియాన్ని ఊపేశాడు.
మ్యాచ్ 13వ ఓవర్‌కు చేరుకునే సమయానికి, రాజస్తాన్ మ్యాచ్ దాదాపు జేజారిపోయే స్థితిలో కనిపించింది. అలాంటి సమయంలో స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్ లో.. తొలి బంతికి హెట్‌మయర్ ఓ సింగిల్ తీసిన తర్వాత, పరాగ్ వరుసగా ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. మొయిన్ వేసిన ఈ ఓవర్ లో ఒక వైడ్ తో కలిపి మొత్తం 32 పరుగులు వచ్చాయి.
తదుపరి ఓవర్‌లోనూ పరాగ్ జైత్రయాత్ర ఆగలేదు. వరుణ్ చక్రవర్తి వేసిన 14వ ఓవర్‌లో రెండో బంతికి మరో సిక్సర్ వచ్చింది. అనంతరం స్టైక్ లోకి వచ్చిన పరాగ్ సిక్స్ బాది వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ దూకుడు బ్యాటింగ్‌తో పరాగ్ కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
మొత్తంగా 45 బంతుల్లో 95 పరుగులు (6 ఫోర్లు, 8 సిక్సులు) నమోదు చేసి హర్షిత్ రాణా బౌలింగ్‌లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ రాజస్థాన్ ఓడిపోయినా విధ్వంసాత్మక ఇన్నింగ్స్‌తో నెట్‌లో రియాన్ పరాగ్ వీడియోలు వైరల్ అవుతోంది. రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ పై ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.