Rohan Bopanna: టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత టెన్నిస్‌పై చెరగని ముద్ర వేసిన 45 ఏళ్ల బోపన్న రెండు దశాబ్దాలకుపైగా కెరీర్‌ను కొనసాగించాడు. అతని చివరి మ్యాచ్ పారిస్ మాస్టర్స్ 1000లో అలెగ్జాండర్ బుబ్లిక్‌తో కలిసి డబుల్స్ ఆడాడు. 45 ఏళ్ల బోపన్న సోషల్ మీడియా మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. “ఇది కేవలం వీడ్కోలు మాత్రమే.. ముగింపు కాదు. నా జీవితానికి అర్థాన్ని ఇచ్చిన ఈ ఆటను నేను ఎలా వదులుకోగలను? నా 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన జ్ణాపకాలు ఉన్నాయి. అయితే నా రాకెట్‌ను పక్కటన పెట్టాల్సిన సమయం అసన్నమైంది. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. బరువెక్కిన హృదయంతో ఈ నోట్ రాశాను. కర్ణాటకలోని కూర్గ్ అనే చిన్న పట్టణం నుంచి నా జర్నీని ప్రారంభించి.. ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఆడటం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులకు, కోచ్‌లకు, అభిమానులు ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్‌ను ధన్యవాదాలు” అని తన రిటైర్మెంట్ నోట్‌లో పేర్కొన్నాడు
సుదీర్ఘ కాలం టెన్నిస్ ఆడి..
బోపన్న సుదీర్ఘకాలం భారత టెన్నిస్ ఆడి విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నాడు. గాయాలు బాధించినా.. రెండు మోకాళ్లలోని గుజ్జు (కార్టిలేజ్) అరిగిపోయి ఇబ్బంది పడ్డా.. వరుసగా ఓటములు ఎదురైనా.. అతను ఆగిపోలేదు. 2019లో రోజుకు రెండు లేదా మూడు పెయిన్ కిల్లర్స్ మాత్రలు వేసుకుంటూ బోపన్న ఆట కొనసాగించాడు. గేమ్ పైన అతని డెడికేషన్ ఇంతకు మించి ఇంకేముంటుంది? ఈ సమస్య నుంచి యోగా వల్లే బోపన్న బయటపడ్డాడు. కరోనా సమయంలో 2020లో బోపన్న.. అయ్యంగార్ యోగా చేయడం మొదలెట్టాడు. వారంలో నాలుగు సార్లు 90 నిమిషాల చొప్పున యోగా చేసేవాడు. దీంతో క్రమంగా మోకాలి నొప్పి మాయమైంది. ఎలాంటి మాత్రలు వాడాల్సిన అవసరం లేకపోయింది. అక్కడి నుంచి అతని కెరీర్ మళ్లీ కొత్తగా మొదలైంది. మరింత ఉత్సాహంతో బోపన్న కోర్టులో సాగిపోయాడు.
అత్యంత పెద్ద వయస్కుడిగా.
43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 డబుల్స్‌లో విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు. దీంతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్నాడు. అతిపెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్‌గా, డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంకర్‌గా ఆటగాడిగా రోహన్ బోపన్న ఘనత సాధించాడు. రెండు సార్లు (2010, 2023) యుఎస్ ఓపెన్‌లోనే రన్నరప్‌గా నిలిచాడు. 2017 ఫ్రెంచ్ ఓపెన్‌లో గాబ్రియల్ డబ్రోస్కీ (కెనడా)తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ దక్కించుకున్నాడు. టూర్ స్థాయి డబుల్స్ టైటిళ్లు 26 నెగ్గాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిళ్లు ఆరు గెలిచాడు. ఇతడి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డు, 2024లో పద్మ శ్రీ పురస్కారంతో అతడ్ని సత్కరించింది.


