Rohit Kohli return ODI series : క్రికెట్ అభిమానుల ఐదు నెలల నిరీక్షణకు తెరపడనుంది. టీమిండియా పరుగుల యంత్రాలు, ఆధునిక క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ బరిలోకి దిగనున్నారు. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత, ఈ ఇద్దరు స్టార్లు తొలిసారిగా వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. దీంతో, ఈ ద్వైపాక్షిక సిరీస్‌కు అసాధారణమైన క్రేజ్ ఏర్పడింది. మరి ఈ అద్భుతమైన పోరాటాన్ని మనం ఉచితంగా ఎక్కడ చూడవచ్చు..? సిరీస్ షెడ్యూల్ ఏంటి.?
ఆసీస్‌కు పయనం : స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే, టీమిండియా వన్డే జట్టు ఆస్ట్రేలియాకు పయనమైంది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు, సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర జట్టు సభ్యులు బుధవారం ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మిగిలిన బృందం కూడా వారిని అనుసరించింది.
ఐదు నెలల తర్వాత : ఈ ‘రో-కో’ జోడి చివరి మ్యాచ్ ఈ ఏడాది మార్చి 9వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అంతర్జాతీయ మ్యాచ్లో ఆడింది. అప్పటి నుంచి వీరిద్దరూ టీమిండియా జెర్సీలో కనిపించలేదు. దీంతో, వారి బ్యాటింగ్ విన్యాసాల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 19న పెర్త్‌లో జరిగే తొలి వన్డేలో రోహిత్ కోహ్లీ తుది జట్టులో ఉండటం ఖాయం.
ఉచితంగా ఎక్కడ చూడొచ్చు : ఈ పర్యటనకు సంబంధించిన ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (టీవీ), జియో హాట్‌స్టార్ (ఓటీటీ) దక్కించుకున్నాయి.
టీవీలో: స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ఓటీటీలో: జియో హాట్‌స్టార్ యాప్‌లో చూడవచ్చు. అయితే, ఈ రెండింటిలోనూ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి.
ఉచితంగా చూడాలంటే : దూరదర్శన్ (DD) స్పోర్ట్స్ ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లను ఉచితంగానే ప్రసారం చేస్తారు. అయితే, ఇది కేవలం భూస్థిత నెట్‌వర్క్ (Terrestrial Network) కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. సాధారణ కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు ఫ్రీగా రాదు.
వన్డే సిరీస్ షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం)
తొలి వన్డే: అక్టోబర్ 19, ఉదయం 9:00 గంటలకు (పెర్త్)
రెండో వన్డే: అక్టోబర్ 23, ఉదయం 9:00 గంటలకు (అడిలైడ్)
మూడో వన్డే: అక్టోబర్ 25, ఉదయం 9:00 గంటలకు (సిడ్నీ)
భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,యశస్వీ జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్,అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.


