టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. తాజాగా టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పాడు. ఈమేరకు ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశాడు. ఇప్పటివరకు 67 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 4,301 పరుగులు చేశాడు. అందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలున్నాయి. అయితే హిట్‌మ్యాన్ భారత్ తరఫున వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు.
కాగా వచ్చే నెలలో భారత్ ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటన వెళ్లనుంది. ఈ సిరీస్‌కు కొత్త కెప్టెన్‌తో వెళ్లాలని బీసీసీఐ భావించినట్లు సమాచారం. దీంతో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. రోహిత్ రిటైర్మెంట్ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను ప్రకటించనుంది. జట్టు భవిష్యత్ దృష్ట్యా శుభ్‌మన్ గిల్ లేదా రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌ను సారథిగా ఎంపిక చేయనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.