ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భారత జట్టు ఒక్క పరాజయం కూడా లేకుండానే ఫైనల్ వెళ్లిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఇప్పటికే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్ల నుంచి స్టార్ ఆటగాళ్లు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, బంగ్లా సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం వన్డేలకు గుడ్‌బై చెప్పగా.. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇక టీమిండియా నుంచి ఎవరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే చర్చ మొదలైంది.
రోహిత్ శర్మ(Rohit Sharma) వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి గుడ్ బై పలికి కేవలం ఆటగాడిగా కొనసాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య చర్చలు కూడా కొనసాగినట్లు సమాచారం. వచ్చే వన్డే వరల్డ్ కప్‌కు జట్టు సిద్ధం కావాలంటే స్థిరమైన కెప్టెన్ అవసరమని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విరాట్ కోహ్లీ వింలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మరి ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.