టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఫోర్లు, సిక్సర్లతో బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో 32వ సెంచరీ నమోదు చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఓపెనర్‌గా ఇప్పటివరకు 15,404 పరుగులు చేశాడు. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను బ్రేక్ చేశాడు. సచిన్ మూడు ఫార్మాట్‌లలో కలిపి ఓపెనర్‌గా 15,335 పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. త్వరలోనే వీరూ రికార్డును కూడా హిట్ మ్యాన్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.
మరోవైపు అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ మూడో స్థానం దక్కించుకున్నాడు. తొలి స్థానంలో కోహ్లీ(50), సచిన్(49) సెంచరీలతో తొలి రెండు స్థానాల్లో ఉండగా.. రోహిత్ 32 సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక భారత్ తరపున మూడు ఫార్మాట్‌లలో కలిపి 49 శతకాలు బాదాడు. ఈ జాబితాలో సచిన్ (100 సెంచరీలు), విరాట్ కోహ్లీ (81 సెంచరీలు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో టాప్-10లోకి హిట్‌మ్యాన్ దూసుకొచ్చాడు. కాగా రోహిత్ 2007లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.