టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఇంగ్లండ్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీ(119)తో ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రోహిత్.. మరో రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. మరో 13 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల రన్స్ చేసిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు రోహిత్ 259 ఇన్నింగ్స్‌ల్లో 10,987 పరుగులు చేశాడు. బుధవారం అహ్మదాబాద్‌లో జరిగే మూడో వన్డేలో ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది.
ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 259 ఇన్సింగ్స్‌ల్లో 11వేల పరుగులు చేయగా.. ఆసీసీ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 286 ఇన్సింగ్స్‌ల్లో, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 288 ఇన్సింగ్స్‌ల్లో, సౌతాఫ్రికా లెజెండరీ ఆటగాడు జాక్వెస్ కలిస్ 293 ఇన్సింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నారు. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే 11వేల పరుగులు చేసి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉంటే భారత్, ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్ విషయానికి వస్తే… ఇప్పటికే టీమిండియా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. దీంతో బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగే మూడో వన్డే నామమాత్రంగా మారింది. అయితే ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తుంటే.. చివరి మ్యాచైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లాండ్ జట్టు పట్టుదలతో ఉంది.