Rohit Sharma : బంగ్లాదేశ్ పర్యటనను టీమ్ఇండియా ఓటమితో ఆరంభించింది. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ కాగా లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయి 46 ఓవర్లలో చేధించింది. బ్యాటింగ్, ఫీల్డింగ్ లలో తప్పిదాల వ్లలనే టీమ్ఇండియా ఈ మ్యాచ్‌ను చేజేతుగా పోగొట్టుకుంది.
భారత జట్టు ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మరో 25 నుంచి 30 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో తాము అద్భుతంగా పోరాడామని, క్రెడిట్ మొత్తం బౌలర్లకే దక్కుతుందన్నాడు. మొదటి బంతి నుంచి బంగ్లా బ్యాటర్లకు బౌలర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. ఆఖరి వరకు వంద శాతం పోరాడారు. అయితే.. 184 పరుగులు సరిపోవు. మేము మరో 25 నుంచి 30 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేదన్నాడు.
వరుసగా వికెట్లు కోల్పోవడంతో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యాం. ఇలాంటి పిచ్‌లపై ఎలా ఆడాలో నేర్చుకోవాలన్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లలో ఇంకా కష్టపడాలని బ్యాటర్లకు సూచించాడు. రెండో మ్యాచ్ కోసం అతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. రెండో వన్డేల్లో మెరుగ్గా రాణిస్తామని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
కాగా.. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే జరగనుంది.