Sachin Tendulkar’s 2011 World Cup strategy : 2011 ప్రపంచ కప్ ఫైనల్.. వాంఖడే స్టేడియం.. ధోనీ కొట్టిన ఆ సిక్సర్.. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ యావత్ భారతావని ఆనందంతో ఉప్పొంగిపోయిన క్షణాలు అవి. ఆ చారిత్రక విజయం గురించి మాట్లాడినప్పుడల్లా మనకు గుర్తొచ్చేది ధోనీ అద్భుత కెప్టెన్సీ, గంభీర్ వీరోచిత ఇన్నింగ్స్. కానీ, ఆ గెలుపు వెనుక ఎవరికీ తెలియని ఓ మైండ్ గేమ్ ఉంది. ఆ వ్యూహాన్ని రచించిన అసలు సూత్రధారి మరొకరైతే..? 14 ఏళ్ల తర్వాత, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్వయంగా ఆ రహస్యాన్ని బయటపెట్టారు. అసలు ఆ రోజు ఏం జరిగింది..? ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి..?
ప్రపంచ కప్ 2011 ఫైనల్స్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, ఫామ్‌లో ఉన్న యువరాజ్ సింగ్ కంటే ముందు బ్యాటింగ్‌కు రావడం ఇప్పటికీ చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయమే. దీని వెనుక ఉన్నది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పదునైన వ్యూహమేనని వీరేంద్ర సెహ్వాగ్ గతంలో చెప్పినా, ఇప్పుడు సచిన్ స్వయంగా దానిపై పూర్తి స్పష్టతనిచ్చారు. రెడ్డిట్ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఆనాటి రహస్యాన్ని విప్పారు.
సచిన్ వేసిన ప్లాన్.. ధోనీని ముందుకు పంపడం : శ్రీలంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్య ఛేదనలో, విరాట్ కోహ్లీ వికెట్ పడిన తర్వాత వాస్తవానికి యువరాజ్ సింగ్ క్రీజులోకి రావాలి. కానీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న సచిన్, అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌తో కలిసి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక రెండు బలమైన కారణాలున్నాయని సచిన్ వివరించారు.
లెఫ్ట్-రైట్ కాంబినేషన్ వ్యూహం : ఆ సమయంలో శ్రీలంక బౌలింగ్‌లో ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కీలకంగా ఉన్నాడు. క్రీజులో గౌతమ్ గంభీర్ (ఎడమచేతి వాటం) ఉండగా, మరో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ యువరాజ్‌ను పంపితే, స్పిన్నర్లకు బౌలింగ్ చేయడం సులువవుతుంది. అదే, గంభీర్‌కు జతగా కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన ధోనీని పంపితే, బౌలర్ల లయ దెబ్బతింటుంది. ఈ లెఫ్ట్-రైట్ కాంబినేషన్, ఫీల్డ్ సెట్టింగ్‌లోనూ బౌలర్లను ఇబ్బంది పెడుతుందని సచిన్ భావించారు.
మురళీధరన్‌పై ధోనీకి ఉన్న పట్టు : ఇదే అత్యంత కీలకమైన అంశం. 2008 నుంచి 2010 వరకు, అంటే మూడేళ్ల పాటు ఐపీఎల్‌లో ముత్తయ్య మురళీధరన్, ఎం.ఎస్. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కలిసి ఆడారు. “ధోనీ, నెట్స్‌లో మురళీధరన్ బౌలింగ్‌ను వందల సార్లు ఎదుర్కొన్నాడు. అతని బౌలింగ్‌లోని గూగ్లీ, వంటి అన్ని వైవిధ్యాలపైనా ధోనీకి పూర్తి అవగాహన ఉంది. ఆ అనుభవం ఫైనల్ ఒత్తిడిలో మురళీధరన్‌ను ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది” అన్నది సచిన్ వ్యూహం.
సరిగ్గా సచిన్ ఊహించినట్లే జరిగింది. ధోనీ (91*), గంభీర్ (97)తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఆనాటి డ్రెస్సింగ్ రూమ్‌లో సచిన్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగే, 14 ఏళ్ల తర్వాత నేడు వెల్లడై, ఆయనను కేవలం గొప్ప ఆటగాడిగానే కాకుండా, ఓ గొప్ప క్రికెట్ మేధావిగానూ మరోసారి నిలబెట్టింది.


