Arjun Tendulkar Engagement: క్రికెట్ గాడ్, భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగిందని రకరకాల కథనాలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్ అన్నింటికీ సచిన్ చెక్ పెట్టాడు. అర్జున్ ఎంగేజ్మెంట్ జరిగిందని మాస్టర్ బ్లాస్టర్ ధృవీకరించాడు. దీంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.
అర్జున్త తన స్నేహితురాలు సానియా చందోక్‌తో ఆగస్టు 14న నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియా రెడిట్ లో జరిగిన ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌లో ఒక ఫ్యాన్ నేరుగా సచిన్ దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అర్జున్ ఎంగేజ్మెంట్ జరగడం నిజమేనా అని ఆయన్ను ప్రశ్నించాడు. దీనికి సచిన్ అవుననే సమాధానమిచ్చారు. ”అతడి ఎంగేజ్మెంట్ జరిగింది. మేమంతా అతడి కొత్త ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాం” అని సచిన్ చెప్పారు. దీంతో అనేక ఊహాగానాలకు తెరపడింది.
సానియా ముంబైలోని బాస్కిన్ రాబిన్స్ ఇండియా ఫ్రాంచైజీని నడిపే గ్రావిస్ గ్రూప్ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఆతిథ్య మరియు ఆహార పరిశ్రమలకు ఘాయ్ కుటుంబం పెట్టింది పేరు. వారు ఇంటర్ కాంటినెంటల్ హోటల్ మరియు బ్రూక్లిన్ క్రీమరీ యజమానులు కూడా. ఈ గ్రూప్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.624 కోట్ల టర్నోవర్ సాధించింది. అర్జున్ మరియు సానియా నిశ్చితార్థ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలెబ్రిటీలు విషెష్ చెబుతున్నారు. సచిన్ లాగే అర్జున్ కూడా తన జీవిత భాగస్వామి కంటే ఏడాది చిన్నోడు.
Also Read: Sachin Tendulkar’s 2011 World Cup strategy – 2011 ప్రపంచ కప్ ఫైనల్
25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ క్రికెట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతను ఎడమ చేతి వాటం పేసర్. అర్జున్ ప్రస్తుతం దేశీవాళీ క్రికెట్ లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతడు 17 ఫస్ట్-క్లాస్ మ్యాచుల్లో 37 వికెట్లు పడగొట్టడంతోపాటు 532 పరుగులు చేశాడు. అంతేకాకుండా 24 టీ20లు ఆడి 27 వికెట్లు తీయడంతోపాటు 119 రన్స్ సాధించాడు. అతడు లిస్ట్-ఏ క్రికెట్ లో 25 వికెట్లు తీయడంతోపాటు 102 పరుగులు చేశాడు. అర్జున్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. ఇతడి ఐపీఎల్ కెరీర్ 2023 ప్రారంభమైంది. ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సీజన్ లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు అర్జున్. అతడు ఈ మ్యాచ్ లో వికెట్లేమీ తీయలేదు.


