Arjun Tendulkar: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టారు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) జట్టు తరఫున అర్జున్ అరంగేట్రం (Debute) చేశారు. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు ఓటమిపాలైనప్పటికీ.. అర్జున్ తన అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. దీంతో సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
లక్నో తరఫున తొలి మ్యాచ్: అర్జున్ టెండూల్కర్ కెరీర్‌కు ఈ ఐపీఎల్ సీజన్ చాలా కీలకంగా మారింది. ముంబై ఇండియన్స్ జట్టు వీడిన అనంతరం మెగా వేలానికి ముందే ఆయన లక్నో సూపర్ జాయింట్స్ జట్టులోకి మారారు. కొత్త జట్టులోకి వచ్చిన తర్వాత ఆయన ఆడిన మొదటి సీజన్ ఇదే. అయితే లక్నో జట్టు అప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడంతో.. లీగ్ స్టేజ్‌లో ఆ జట్టుకు ఉన్న చివరి మ్యాచ్‌లో అర్జున్‌కు తుది జట్టులో ఆడే అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ 5 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేశారు.
బౌలింగ్‌లో అర్జున్ మార్క్: ఆ తర్వాత బౌలింగ్‌లో అర్జున్ తన మార్క్ చూపించారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తూ 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి ఒక కీలక వికెట్ పడగొట్టారు. నిజానికి తన మొదటి ఓవర్ లోనే పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను అవుట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈజీ క్యాచ్ వదిలేశారు. అయినా పట్టుదలతో బౌలింగ్ చేసిన అర్జున్ తన మూడో ఓవర్ లో ఒక అద్భుతమైన యార్కర్‌తో అదే ప్రభ్‌సిమ్రన్‌ను ఎల్‌బిడబ్ల్యూ (LBW) రూపంలో పెవిలియన్‌కు పంపారు. ఆ మ్యాచ్‌లో లక్నో బౌలర్లందరి కంటే అర్జున్ ఎకానమీ రేట్ తక్కువగా ఉండడం విశేషం.
Also Read-PBKS VS LSG: సెంచరీతో ‘శ్రేయస్’ విధ్వంసం.. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
సచిన్ ఎమోషనల్ పోస్ట్: కొడుకు ప్రదర్శన పట్ల సచిన్ టెండూల్కర్ ఎంతో గర్వపడ్డారు. ఈ సీజన్ అంతా అర్జున్ ఎంతో ఓపికగా.. సానుకూల దృక్పథంతో ఉన్నాడని సచిన్ కొనియాడారు. “చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం ఎదురుచూస్తూ.. నీపై నమ్మకంతో నిశ్శబ్దంగా కష్టపడిన విధానం చూసి గర్వంగా ఉంది. క్రికెట్ అనేది కేవలం నైపుణ్యాన్ని మాత్రమే కాదు.. ఓపికను కూడా పరీక్షిస్తుంది. నువ్వు ఆ రెండింటినీ చక్కగా హ్యాండిల్ చేశావు. ఎప్పుడూ ఒదిగి ఉండు.. ఆటను ఎప్పటిలాగే ప్రేమిస్తూ ముందడుగు వేయ్” అని సచిన్ తన కొడుకును అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. వచ్చిన చాన్స్‌ను చక్కగా సద్వినియోగం చేసుకున్న అర్జున్ టెండూల్కర్ ప్రదర్శనపై క్రీడా వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ యువ ఆల్‌రౌండర్ తన ఆటను మరింత మెరుగుపరుచుకుని జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

