Sanju Samson : సంజు శాంసన్ గత కొంతకాలంగా ఈ టీమ్ఇండియా ఆటగాడి పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. ఎంతగా రాణించినప్పటికి టీమ్ఇండియాలో తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. సిరీస్‌లకు ఎంపిక చేస్తున్నా.. మ్యాచ్‌లు మాత్రం ఆడించడం లేదు. ఎప్పుడో ఓసారి లభించిన అవకాశాల్లో సత్తా చాటినప్పటికీ మరుసటి మ్యాచ్‌కు బెంచీపై కూర్చోపెడుతారు. సంజు తరువాత వచ్చిన ప్లేయర్లు టీమ్‌లో సెటిల్ అయినప్పటికీ శాంసన్‌కు అవకాశాలు రావడమే గగనమైపోయాయి. ఎంత ట్యాలెంట్ ఉంటే ఏం లాభం వరుసగా మ్యాచ్‌లు ఆడిస్తేనే గదా అతడి సత్తా ఏంటో తెలిసేది.
ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. రంజీ సీజన్ 2022-23 సీజన్‌కు కేరళ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు సంజు. ఈ టోర్నీలో వరుస అర్థశతకాలతో దూసుకుపోతున్నాడు. జార్ఖండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 72 పరుగులతో రాణించిన సంజు రాజస్థాన్‌తో మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. సంజుతో పాటు సచిన్ బేబీ రాణించడంతో రెండో రోజు రెండో సెషన్ ముగిసే సమయానికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
ఇలా రంజీల్లో వరుస అర్థశతకాలు చేయడంపై అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తే పట్టించుకోని సెలక్టర్లు రంజీల్లో రాణిస్తే మాత్రం జట్టులో చోటు ఇస్తారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. నువ్వు అర్థశతకాలు కాదు ట్రిపుల్ సెంచరీలు కొట్టినా టీమ్‌మేనేజ్‌మెంట్ కరుణించదు అంటూ తమ వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.