Ind vs Ban 2nd ODI : మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో ఓడిన టీమ్ఇండియా మరో సమరానికి సిద్దమైంది. నేడు(బుధవారం) అతిథ్య బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో తలపడనుంది. గత మ్యాచ్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకుని ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని రోహిత్ సేన గట్టి పట్టుదలగా ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా బంగ్లా విజయం సాధిస్తే సిరీస్ కూడా ఆ జట్టు సొంతం అవుతుంది. దీంతో ఒత్తిడి అంతా టీమ్ఇండియాపైనే ఉంది. జట్టుగానే కాకుండా వ్యక్తిగతంగా రోహిత్ కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. మరీ ఈ మ్యాచ్‌లోనైనా హిట్‌మ్యాన్ తన బ్యాట్ ఝుళిపిస్తాడో లేదో చూడాలి.
తొలి వన్డేలో ఒక్క కేఎల్ రాహుల్ మినహా మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. దీంతో కనీసం రెండు వందల పరుగులను కూడా భారత జట్టు చేయలేకపోయింది. అయితే బౌలర్లు రాణించడంతో గట్టెక్కేలా కనిపించింది. చివరి వికెట్ ను తీయలేక భారీ మూల్యం చెల్లించుకుంది. పదో వికెట్‌కు ముస్తాఫిజుర్, మెహదీ హసన్ ఏకంగా 51 పరుగులు జోడించి బంగ్లాదేశ్‌ను గెలిపించారు. తొలి వన్డే జరిగిన మీర్‌పూర్ స్టేడియంలోనే రెండో వన్డే జరగనుంది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు చెలరేగాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. కేఎల్ రాహుల్ తన ఫామ్‌ను కంటిన్యూ చేయాల్సి ఉండగా, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లు తమ స్థాయికి తగ్గట్లు సత్తాచాటితే భారీ స్కోర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. తొలి వన్డేలో బరిలోకి దిగిన జట్టుతోనే లేదంటే ఒక్క మార్పుతో టీమ్ఇండియా ఆడే అవకాశం ఉంది.
మరోవైపు బంగ్లాదేశ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో ఆడినట్లుగానే మరోసారి అద్భుతం చేయాలని ఆ జట్టు భావిస్తోంది. దీంతో మరోసారి హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.