Shafali Verma- Sachin Tendulkar:భారత మహిళా జట్టు చరిత్రలో మరో మైలురాయిని రాసిన ఫైనల్ మ్యాచ్‌లో షెఫాలి వర్మ చేసిన ప్రదర్శన ఇప్పుడు అందరి చర్చకు కేంద్రంగా మారింది. అనూహ్యంగా జట్టులోకి తిరిగి వచ్చిన ఈ యువ క్రీడాకారిణి బ్యాట్‌తో మెరుపులు మెరిపించడమే కాదు, బంతితో కూడా అద్భుతంగా రాణించి భారత్‌కు విజయం అందించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత షెఫాలి చెప్పిన మాటలు ఆమె ఆత్మవిశ్వాసం, పట్టుదల, స్ఫూర్తిని ప్రతిబింబించాయి.
ఒక చిన్న సంఘటన…
ఫైనల్‌కి ముందు జరిగిన ఒక చిన్న సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చింది. మ్యాచ్ ప్రారంభానికి కాసేపటి ముందు సచిన్ టెండూల్కర్‌ను చూసినప్పుడు తాను ఉత్సాహంతో నిండిపోయానని షెఫాలి తెలిపింది. ఆ క్షణంలో సచిన్‌తో మాట్లాడే అవకాశం దొరికిందట. ఆ సంభాషణ తనలో విశ్వాసాన్ని నింపిందని ఆమె చెప్పారు. సచిన్ చెప్పిన కొన్ని మాటలు తనలో కొత్త ధైర్యాన్ని రేకెత్తించాయని, ఆటలో ఏ పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా ఉండడం నేర్పాయని షెఫాలి గుర్తుచేసుకుంది.
Also Read: https://teluguprabha.net/sports-news/rohit-sharma-emotional-as-india-women-win-world-cup/
వికెట్‌ను పడగొట్టి..
ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంలో ఆమె పాత్ర అత్యంత కీలకమైంది. మొదట బ్యాటింగ్‌లో 87 పరుగులతో జట్టును నిలబెట్టిన ఆమె, తర్వాత బౌలింగ్‌లో కూడా ప్రత్యర్థి జట్టును ఒత్తిడికి గురిచేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఊహించని సమయానికి ఆమెకు బంతి అప్పగించారు. ఆ నిర్ణయం రిస్కీగా అనిపించినా, హర్మన్‌ప్రీత్‌కి షెఫాలి మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని షెఫాలి నిలబెట్టింది. తన మొదటి ఓవర్‌లోనే కీలక వికెట్‌ను సాధించింది. ఆ ఉత్సాహంతో మరో ముఖ్యమైన వికెట్‌ను పడగొట్టి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది.
ఈ ఫైనల్ ముందు షెఫాలి కి అంత తేలిగ్గా దొరికింది కాదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ రంగంలో అడుగుపెట్టిన ఈ హరియాణా యువతి, అప్పటి నుంచి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆగ్రహ స్వభావం, ధైర్యమైన ఆటతీరు ఆమెను అభిమానుల మనసుల్లో ప్రత్యేకంగా నిలిపాయి. అయితే, దిల్లీ క్రీడాకారిణి ప్రతీక రావల్ స్థిర ప్రదర్శనతో కొంతకాలం షెఫాలి జట్టులో స్థానం కోల్పోయింది. కానీ ప్రపంచకప్‌కు ముందు రావల్ గాయపడటంతో షెఫాలి మళ్లీ జట్టులోకి వచ్చింది.
పెద్దగా రాణించలేకపోయినా..
తన రెండో అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. సెమీఫైనల్లో పెద్దగా రాణించలేకపోయినా, ఫైనల్లో మాత్రం అద్భుతంగా ఆడింది. బ్యాటింగ్‌లో నిరీక్షణ, బౌలింగ్‌లో కచ్చితత్వం చూపి జట్టును విజయతీరాలకు చేర్చింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడినప్పుడు షెఫాలి చిరునవ్వుతో తన భావాలను పంచుకుంది. “సచిన్ సర్‌ను చూసిన వెంటనే ఏదో పెద్ద పని చేయబోతున్నానని నాలో నమ్మకం కలిగింది. ఆ మాటలే నా మనసులో ప్రతిధ్వనించాయి. ఫీల్డులో అడుగుపెట్టిన తర్వాత నేను భయాన్ని మరిచిపోయాను. ఆటపై దృష్టి పెట్టా. జట్టు సభ్యులందరూ నాకు విశ్వాసం కలిగించారు,” అని ఆమె చెప్పింది.
ఆమె కళ్లల్లో ధైర్యం…
హర్మన్‌ప్రీత్ కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. “మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతున్న సమయంలో నేను షెఫాలితో మాట్లాడాను. ఆమె కళ్లల్లో ధైర్యం కనిపించింది. ఆ క్షణంలోనే బంతి ఆమె చేతికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ నమ్మకాన్ని ఆమె నెరవేర్చింది,” అని హర్మన్ అన్నారు.
భారత్ జట్టుకు ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ కాదు, విశ్వాసానికి ప్రతీక. షెఫాలి లాంటి యువ క్రీడాకారుణులు ఇప్పుడు దేశానికి కొత్త దారిని చూపుతున్నారు. చిన్న వయసులోనే పెద్ద స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొని గెలవడం సులభం కాదు. కానీ షెఫాలి దాన్ని సాధించింది. హర్యానాలోని రోహ్తక్ నగరానికి చెందిన ఈమె చిన్నప్పటి నుంచే బాలురతో కలిసి ఆడుతూ తన ఆటలో దూకుడును పెంచుకుంది.
ఆమె తండ్రి శంసర్ సింగ్ వర్మ చిన్నప్పటి నుంచే కూతురిని ప్రోత్సహించారు. ఇంటి వద్దే క్రికెట్ ప్రాక్టీస్‌కి సదుపాయం కల్పించారు. కుటుంబ సహకారం, తన కృషి, సచిన్ వంటి దిగ్గజాల స్ఫూర్తి కలిసి షెఫాలిని ఈ స్థాయికి చేర్చాయి. ఈ విజయం ఆమె వ్యక్తిగత సాధన మాత్రమే కాదు, భారత మహిళా క్రికెట్‌లో కొత్త యుగానికి ఆరంభం కూడా.


