Shahid Afridi on Team India: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబరు 9న మెుదలైన ఈ మెగా టోర్నీలో జట్లనీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. గ్రూప్-ఏలో భారత్ ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గ్రూప్-బిలో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ఒక్కో మ్యాచ్ గెలిచి తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆదివారం పాకిస్థాన్ తో టీమిండియా తన రెండో మ్యాచ్ ను ఆడబోతుంది. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా క్రికెటర్ల ద్వంద్వ వైఖరిని అతను తప్పుబట్టాడు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
దుబాయ్ వేదికగా ఈ నెల 14న భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న అఫ్రిదీ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై పరోక్షంగా విమర్శలు చేశాడు. కొంత మంది భారత ఆటగాళ్లు తాము భారతీయులం అని అనిపించుకునే పనిలో ఉన్నారని ఈ సందర్భంగా అతడు వ్యాఖ్యలు చేశాడు. అలాగే పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేందుకు వేదికలు, టోర్నమెంట్స్ అంటూ భారత్ సోకులు చెబుతోందని విమర్శించాడు. ఇలా ద్వంద్వ వైఖరి అవలంభించడం సరికాదని ఆఫ్రిదీ అన్నాడు.
Also Read: Ind vs Pak- పాక్ తో భారత్ పోరు.. తుది జట్టులో ఉండేది ఎవరంటే?
ఆసియా కప్‌లో దాయాది దేశంలో మ్యాచ్ ఆడొద్దనే డిమాండ్ వ్యక్తం అయినప్పటికీ.. బీసీసీఐ ఓకే చెప్పింది. కానీ అంతకంటే ముందు జరిగిన లెజెండ్స్ టోర్నీలో టీమిండియా మాజీ క్రికెటర్లు పాక్ తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు. లీగ్ దశలో ఒక మ్యాచ్, సెమీస్ లో మరో మ్యాచ్ పాక్ తో ఆడాల్సి ఉండగా.. యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత్ జట్టు తమకు దేశం ముఖ్యం అంటూ తమతో మ్యాచ్ ను రద్దు చేసింది. దీనిపై ఆ టోర్నీలో పాక్ కెప్టెన్ గా వ్యవహరించిన అఫ్రిదీ టీమిండియా క్రికెటర్ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడు ఆడని వాళ్లు.. ఇప్పుడు ఆసియా కప్ లో ఎలా ఆడతారని ప్రశ్నించాడు. మీకు ఇష్టం లేకపోతే పూర్తిగా పాక్ తో క్రికెట్ ఆడటమే మానుకోవాలని అతడు అన్నాడు.


