టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) మార్చి నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు(ICC Player of the Month) అందుకున్నాడు. ఈ అవార్డుకు అయ్యర్‌తో పాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు జాకబ్ డఫీ, రచిన్ రవీంద్రలు కూడా పోటీ పడ్డారు. అయితే చివరకు అయ్యర్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డుకు ఎంపిక కావడంపై అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు.
మార్చి నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపిక కావడం గౌరవంగా ఉందన్నాడు. భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన నెలలో తనకు ఈ అవార్డు రావడం ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపాడు. ఈ సందర్భంగా తన సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాడు.
కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ 243 రన్స్‌తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. మార్చి నెలలో మూడు మ్యాచ్‌లు ఆడి 172 పరుగులు చేశాడు. ఈ అవార్డు వరుసగా భారత ప్లేయర్లకే దక్కడం విశేషం. ఇప్పటివరకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గిల్ మూడు సార్లు దక్కించుకోగా.. జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ రెండేసి సార్లు గెలిచారు. ఇక విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్ ఒక్కోసారి సాధించారు.