India vs New Zealand : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు రాణించారు. దీంతో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ప్రత్యర్థి కివీస్ ముందు 307 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(50; 65 బంతుల్లో 1ఫోర్, 3 సిక్స్‌లు), శిఖర్ ధావన్(72; 77 బంతుల్లో 13 ఫోర్లు) లతో పాటు శ్రేయస్ అయ్యర్(80; 76 బంతుల్లో4ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థశతకాలతో రాణించారు. చివరల్లో వాషింగ్టన్ సుందర్(37నాటౌట్; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టీమ్ సౌథీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా ఆడమ్ మిల్నే ఓ వికెట్ తీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్‌లు తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తరువాత వరుస ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. పంత్ (15), సూర్యకుమార్ యాదవ్(4) లు విఫలం అయినా సంజు శాంసన్(36; 38 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి ధాటిగా బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్లు ఆడే క్రమంలో శాంసన్, శ్రేయస్‌లు ఔట్ అయినా ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సుందర్ ఎడాపెడా బౌండరీలు బాదడంతో స్కోర్ 300 దాటింది.