India ODI Captain: టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే టెస్టులకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో యువ ఆటగాడు శుభమన్ గిల్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో గిల్ నాయకత్వ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాడు. నాయకుడిగా ముందుంటూ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. రెండు టెస్టులో అద్భుతమైన ఆట తీరుతో పాటు కెప్టెన్సీతో చిరస్మరణీయ విజయం సాధించాడు. దీంతో వన్డే కెప్టెన్సీ కూడా గిల్‌కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తుందని సమాచారం. 2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని గిల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు ఇచ్చిన రోహిత్ శర్మ.. వన్డేల్లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. 2027 వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. అయితే బీసీసీఐ మాత్రం అప్పటివరకు రోహిత్ శర్మను కొనసాగించాలా లేదా అనే సందిగ్థంలో పడింది. ఆటగాడిగా కొనసాగించినా కెప్టెన్సీ మాత్రం యువ ఆటగాళ్లకు ఇవ్వాలని సెలెక్టర్లు డిసైడ్ అయ్యారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా శుభమన్ గిల్‌కు త్వరలో జరిగే శ్రీలంక వన్డే సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారని క్రీడా జర్నలిస్ట్ పేర్కొన్నాడు. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే నెటిజన్లు మాత్రం రోహిత్ శర్మ ఉండగా ఇలా చేయడం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ: టెస్టు ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన శుభమన్ గిల్
టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలని ఆలోచించడం ఏంటని మండిపడుతున్నారు. రోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియా గెలుచుకుంది. టెస్టుల్లోనూ అనేక విజయాలు సాధించింది. అయితే వయసు రీత్యా టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్నాడు. తనకు కలగా మిగిలిపోయిన వన్డే వరల్డ్ కప్ కూడా గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. అయితే రోహిత్‌ను సీనియర్ ఆటగాడిగా కొనసాగించి.. కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం గిల్‌కు అప్పగించాలని సెలెక్టర్లు నిర్ణయించుకున్నారట. ఈ మేరకు రోహిత్‌తో కూడా చర్చించారని చెబుతున్నారు. అలాగే టీ20ల్లో కూడా గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే బీసీసీఐ నుంచి కీలక ప్రకటన రానుందని తెలుస్తోంది.


