టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్(Shubman Gill) ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో 112 పరుగులతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా(50 ఇన్నింగ్స్‌ల్లో) 2500 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలురాయి అందుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా రికార్డును బ్రేక్ చేశాడు. ఆమ్లా 51 ఇన్నింగ్స్‌ల్లో 2500 పరుగులు సాధించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా మరో ఘనతను కూడా దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో గిల్‌కు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 50 పరుగులు చేసిన జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. గిల్ కన్నా ముందు శ్రీకాంత్, దిలీప్ వెంగ్ సర్కార్, అజారుద్దీన్, ధోని, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లు ఈ జాబితాలో ఉన్నారు. కాగా 2019 జనవరి 31న న్యూజిలాండ్‌తో హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా గిల్ వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో మూడో వన్డే మ్యాచ్ గిల్‌కి 50వ మ్యాచ్. కెరీర్‌లోనే మైలుస్టోన్ లాంటి మ్యాచ్‌లోనే రెండు రికార్డులను నమోదుచేయడం విశేషం.