Ind vs Eng 2nd Test: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియన్ స్టార్ బ్యాటర్, కెప్టన్ శుభమన్ గిల్ సూపర్ సెంచరీ చేశాడు. 199 బంతుల్లో గిల్ తన శతకం పూర్తి చేసుకున్నాడు. రూట్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన గిల్ ఇంగ్లండ్‌తో వరుసగా రెండు టెస్ట్ మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసి రికార్డు నెలకొల్పాడు.
అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీం ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే అవుటై అభిమానులను నిరాశపరిచాడు. వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తరువాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ 31 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో కరుణ్ హారీ బ్రూక్ చేతికి చిక్కాడు. జోరు మీద కనిపించిన మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 107 బంతుల్లో 87 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్ వరుసగా రెండో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జైస్వాల్, శుభ్‌మన్ గిల్ జోడీ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు.
ALSO READ: https://teluguprabha.net/sports-news/england-won-the-toss-elected-to-field-first-check-lineups-here/
జైస్వాల్ ఔటయ్యాక శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించాక పంత్ 25 పరుగుల వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. వోక్స్ బౌలింగ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలిరోజు మ్యాచ్ ముగిసే సమయానికి గిల్(114), జడేలా (41) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసి పటిష్టస్థిలో ఉంది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచి ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. రెండో టెస్ట్‌కు ముందే టీం ఇండియా మూడు కీలక మార్పులు చేసింది. స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్‌కు ఛాన్స్ ఇచ్చారు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌ను సైతం తుది జట్టులోకి తీసుకుంది.