Chamika Karunaratne : స్టార్ ఆల్‌రౌండర్ చమికా కరుణరత్నే విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. అతడిపై ఏడాది పాటు నిషేదం విధించింది. అంతేకాకుండా 5 వేల డాలర్ల జరిమానా కూడా వేసింది. ఈ నిషేద సమయంలో అతడు ఎటువంటి క్రికెట్ ఆడకూడదు.
ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆటగాళ్ల ఒప్పందంలోని అనేక నిబంధనలను అతడు ఉల్లంఘించాడు. దీనిపై లంక క్రికెట్ బోర్డు సిరీయస్ అయింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఓ విచారణ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ ముందు హాజరైన కరుణరత్నె తాను చేసిన తప్పులను అంగీకరించాడు. దీంతో ప్యానెల్ తన నివేదికను లంక బోర్డుకు అందించింది. లంక బోర్డు కరుణరత్నే పై వేటు వేసింది.
“ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో కరుణరత్నె బోర్డు నిబంధనలను ఉల్లఘించాడు. దీనిపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని వేశాం. కమిటీ ముందు కరుణరత్నె తాను చేసిన నేరాలను అంగీకరించాడు. మరోసారి ఇలాంటి తప్పులకు అతడు పాల్పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. దీంతో అతడిపై ఏడాది పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా నిషేదం విధించాం. అంతేకాకుండా 5వేల డాలర్లు(భారత కరెన్సీలో రూ.4లక్షలు) జరిమానా కూడా వేశామని” లంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.