SL vs BAN Match: శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. రెండు టీమ్స్ ప్లేయర్లు ఆటలో నిమగ్నమయ్యారు. అయితే అప్పుడే స్టేడియంలోకి అనుకోని అతిథి వచ్చింది. ఆ అతిథిని అందరూ భయంతో వణికిపోయారు. చివరకు కాసేపు మ్యాచ్ కూడా నిలిచిపోయింది. ఆ అతిథి ఎవరు అనుకుంటున్నారా.. పాము. అవునండీ మీరు విన్నది నిజమే. శ్రీలంకలో ఇలా జరగడం సర్వసాధారణం.
బుధవారం రాత్రి శ్రీలంక రాజధాని కొలంబోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో లంకేయులు, బంగ్లాదేశీయుల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలోకి ఓ పాము వచ్చింది. వెంటనే గుర్తించిన అంపైర్లు, ఆటగాళ్లు అప్రమత్తమయ్యారు. స్టేడియం భద్రతా సిబ్బంది ఆ పామును సురక్షితంగా బయటకు పంపించారు. ఈ షాకింగ్ ఘటనతో కాసేపు ఆట కూడా నిలిచిపోయింది. పామును బయటకు పంపించిన అనంతరం తిరిగి యధావిథిగా మ్యాచ్ కొనసాగింది.
శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో పాములు దర్శనం అవ్వడం కొత్తేమీ కాదు. గతంలోనూ లంక ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లతో కూడా పాములు స్టేడియంలోకి వచ్చి ఆటగాళ్లను భయపెట్టాయి. ఈ స్టేడియంలో పాములు కనిపించడం సర్వసాధారణమైపోయింది. దీంతో ప్రేమదాస స్టేడియం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. శ్రీలంకలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల పాములు ఎక్కువగా బయట తిరుగుతాయని చెబుతారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అసలంక 106 పరుగులతో అదరగొట్టాడు. కుశాల్ మెండిస్ 45 పరుగులతో రాణించాడు. అనంతరం 245 పరుగులతో లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టు కేవలం 167 పరుగులు మాత్రమే చేసి 10 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక 1-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా.. రెండో టెస్టులో లంక విజయం సాధించింది.