Sourav Ganguly Return To Indian Cricket: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి క్రికెట్ పరిపాలనలోకి సంచలన రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా సోమవారం జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
గంగూలీ అన్న స్నేహాశిష్ గంగూలీ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి కావడం, లోధా కమిటీ మార్గదర్శకాల ప్రకారం ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి రావడంతో, దాదా తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. గంగూలీతో పాటు కార్యదర్శిగా బాబ్లూ కొలయ్, కోశాధికారిగా సంజయ్ దాస్ సహా ఆయన ప్యానెల్ మొత్తం ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది.
ALSO READ: Smriti Mandhana: 50 బంతుల్లోనే శతకం.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన మంధాన
సవాళ్లు, ప్రాధాన్యతలు
గత కొంతకాలంగా ఆర్థిక అవకతవకలు, విశ్వసనీయత సమస్యల కారణంగా CAB ప్రతిష్ట దెబ్బతిన్న నేపథ్యంలో, గంగూలీకి ఈ రెండవ ఇన్నింగ్స్ మరింత సవాలుగా మారే అవకాశం ఉంది. అయితే, తన ఎనిమిదేళ్ల పరిపాలన అనుభవాన్ని ఉపయోగించి సంస్థను ముందుకు తీసుకువెళ్తానని గంగూలీ ధీమా వ్యక్తం చేశారు.
“నేను దీనిని సవాలుగా భావించడం లేదు. CAB, BCCI అధ్యక్షుడిగా నాకు ఎనిమిదేళ్ల అనుభవం ఉంది. బెంగాల్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేస్తాం” అని గంగూలీ తెలిపారు.
CAB అధ్యక్షుడిగా తన ప్రాధాన్యతలను ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ను బలోపేతం చేయడం, బెంగాల్ ప్రో టీ20 లీగ్‌ను ప్రోత్సహించడం, మహిళా క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే జూనియర్, క్లబ్ క్రికెట్‌తో పాటు గ్రాస్‌రూట్ నిర్మాణాలను అభివృద్ధి చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ALSO READ: IND vs PAK: సూపర్ 4 అంటే భయపడుతున్న టీమిండియా.. భారత్ తో మ్యాచ్ అంటే వణుకుతున్న పాక్..
గంగూలీ తిరిగి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ముందున్న ప్రధాన కర్తవ్యాలలో ఒకటి.. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న భారత్-సౌతాఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్ పర్యవేక్షణ. ఇది కాకుండా, వచ్చే ఏడాది T20 ప్రపంచకప్‌లో ఈడెన్ గార్డెన్స్ కీలక మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
CAB తరపున సెప్టెంబర్ 28న జరిగే BCCI వార్షిక సమావేశంలో గంగూలీ పాల్గొననున్నారు. కొత్త క్రీడా చట్టం అమలు చేయబోతున్న ఈ కీలక సమయంలో జాతీయ క్రికెట్‌లో గంగూలీ ప్రభావం మరోసారి పెరిగే అవకాశం ఉంది.
ALSO READ: BCCI President: ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు.. అయినా బీసీసీఐ చీఫ్ ఛాన్స్..?


