Women’s World Cup: ఎవ్వరూ ఊహించనట్లు మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ లోకి సౌతాఫ్రికా దూసుకెళ్లింది. సెమీఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లాండ్ ఎంతో బలమైంది. నాలుగుసార్లు ఛాంపియన్. లీగ్ దశలో ఆ జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయింది కూడా. దీంతో, దక్షిణాఫ్రికాపై పెద్ద అంచనాలే లేవు. కానీ సఫారీ జట్టు అదరగొట్టింది. కెప్టెన్ వోల్వార్ట్ అద్భుత శతకానికి మరిజేన్ కాప్ సూపర్ బౌలింగ్ తోడైన వేళ.. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తూ దక్షిణాఫ్రికా మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత రెండు టీ20 ప్రపంచకప్పుల్లో తుది పోరుకు అర్హత సాధించిన ఆ జట్టుకు.. వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి.
Read Also: Bigg Boss elimination: అబ్బ సాయిరాం.. ఈ వీక్ ఔటయ్యేది ఈమేనా?
సౌతాఫ్రికా బ్యాటింగ్..
ఇకపోతే, కెప్టెన్ లారా వోల్వార్ట్ (169; 143 బంతుల్లో 20×4, 4×6) హీరోచిత శతకంతో దక్షిణాఫ్రికా జట్టు మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో ఆ జట్టు 125 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఘోరంగా ఓడించింది. వోల్వార్ట్ పోరాటంతో మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. తజ్మిన్ బ్రిట్స్ (45; 65 బంతుల్లో 6×4, 1×6), మరిజేన్ కాప్ (42; 33 బంతుల్లో 4×4, 1×6), క్లో ట్రయాన్ (33 నాటౌట్; 26 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎకిల్‌స్టోన్ (4/44) సూపర్‌గా బౌలింగ్ చేసింది. ఛేదనలో మారిజేన్ కాప్ (5/20) ధాటికి ఇంగ్లాండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ నాట్ సీవర్ (64; 76 బంతుల్లో 6×4, 1×6), అలీస్ క్యాప్సీ (50; 71 బంతుల్లో 6×4) రాణించారు. వోల్వార్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అంతేకాకుండా, భారత్- ఆస్ట్రేలియా మధ్య సెమీస్ విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది.
Read Also: Bigg Boss: నీ ఇంటి నెంబర్ తో సహా తెలుసు.. దమ్ముకు దువ్వాడ వార్నింగ్..!
ఇంగ్లాండ్ ఘోర ఓటమి..
ఇక, ఛేదనలో ఇంగ్లాండ్ తేలిపోయింది. ఆరంభమే ఆ జట్టుకు పెద్ద షాక్. టాప్ 3 బ్యాటర్లు డక్ ఔట్ అయ్యారు. కాప్ తొలి ఓవర్లోనే అమీ జోన్స్, హెదర్ నైట్‌లను ఔట్ చేయగా.. రెండో ఓవర్లో బ్యూమాంట్‌ను ఖకా వెనక్కి పంపింది. ఒక్క పరుగుకే ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోవడంతో దక్షిణాఫ్రికా పట్టుబిగించినట్లయింది. ఆ దశలో నాట్ సీవర్, క్యాప్సీ ఆదుకోవడంతో ఇంగ్లాండ్ కోలుకుంది. 23వ ఓవర్లో స్కోరు 108/3. కానీ క్యాప్సీని లుజ్.. కాసేపటి తర్వాత నాట్ సీవర్‌ను కాప్ పెవిలియన్ చేర్చడంతో 138/5తో ఇంగ్లాండ్ ఓటమి బాటలో పయనించింది. ఆ తర్వాత ఎవరూ ఇంగ్లాండ్‌ను ఆదుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు .. సౌతాఫ్రికాకు తలవంచక తప్పలేదు. ఇంగ్లాండ్ 56 పరుగుల వ్యవధిలో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది.


