సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20) 2025 మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. దీంతో ఈ లీగ్ చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. జనవరి 9 నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 8న ముగుస్తుంది. ఈ టోర్నీ డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుండగా.. స్టార్ స్పోర్ట్స్2, స్పోర్ట్స్ 18లో ప్రసారం కానుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్ల మధ్య జరగనుంది. ఇప్పటివరకు ఈ లీగ్ రెండు సీజన్‌లు జరగగా.. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలవడం విశేషం.
ఈ సీజన్‌లో 30 రోజుల పాటు 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 30 లీగ్ మ్యాచ్‌లు, రెండు క్వాలిఫైయర్ మ్యాచ్‌లు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. ప్లేఆఫ్‌లు ఫిబ్రవరి 4న ప్రారంభం కానున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు 10 మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కు చేరుకుంటాయి. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్-1లో తలపడతాయి. గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు క్వాలిఫైయర్-1లో ఓడిన జట్టుతో కలిపి క్వాలిఫైయర్-2 ఆడుతుంది. గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఫిబ్రవరి 8న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.