ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి 15 వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా(South Africa) క్రికెటర్లు ఐపీఎల్‌కు దూరం కానున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్(IPL) 2025 ఫైనల్ మే 25 న జరగాల్సి ఉంది. . అయితే భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు టోర్నీ వాయిదాపడిన సంగతి తెలిసిందే. మే 17 నుంచి టోర్నీ పునఃప్రారంభం కానుండగా.. జూన్ 3 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇదిలా ఉంటే జూన్ 11న ప్రారంభమయ్యే WTC ఫైనల్ మ్యాచ్‌లో ఆటగాళ్లు మే 26వ తేదీ లోగా స్వదేశానికి తిరిగి రావాలని క్రికెట్ దక్షిణాఫ్రికా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ కాన్రాడ్ మాట్లాడుతూ.. ఐపీఎల్, బీసీసీఐతో ప్రాథమిక ఒప్పందం ప్రకారం ఫైనల్ మే 25న జరగాలని, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు 26న స్వదేశం చేరుకోవాలన్నారు. కానీ ఇప్పుడు ఐపీఎల్ పొడిగించినప్పటికీ తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని.. ఆటగాళ్లు మే 26న సౌతాఫ్రికా వచ్చేయాలని తెలిపారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో 8 మంది ఐపీఎల్ ఆడుతున్నారు. వీరిలో మార్క్‌రమ్ (లక్నో సూపర్ జెయింట్స్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్), వియాన్ ముల్డర్ (సన్ రైజర్స్ హైదరాబాద్), ర్యాన్ రికెల్‌టన్ (ముంబై ఇండియన్స్), కార్బిన్ బాస్ (ముంబై ఇండియన్స్), లుంగి ఎంగిడి (ఆర్సీబీ), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), మార్కో జాన్సెన్ (పంజాబ్ కింగ్స్) వంటి ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.