HomeTop StoriesHardik Pandya: ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్య గుడ్‌బై?

Hardik Pandya: ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్య గుడ్‌బై?

Mumbai Indians: ఐపీఎల్‌-2026లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కెప్టెన్ హార్దిక్ పాండ్య ముంబయి ఫ్రాంచైజీతో బంధాన్ని తెంచుకోనున్నాడా? అంటే ఐపీఎల్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో ముంబయి ప్లేఆఫ్స్ అవకాశాలు గల్లంతు కావడంతో హార్దిక్ జట్టును వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.గత కొంతకాలంగా మైదానం లోపల, వెలుపలా ఎదురవుతున్న పరిణామాలు హార్దిక్‌ను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయని సమాచారం. దీంతో అతడు పూర్తిగా అలసిపోయాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అతడు ఫ్రాంచైజీ యాజమాన్యానికి కూడా స్పష్టం చేసినట్లు క్రికెట్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

- Advertisement -

అభిమానుల వ్యతిరేకత: 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబయి ఇండియన్స్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన హార్దిక్‌కు రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. రోహిత్‌ను తప్పించడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎంఐ అభిమానులు.. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు మైదానంలో హార్దిక్‌ను పెద్ద ఎత్తున హేళన చేశారు. ఇది అతనిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపింది.

సీనియర్లతో పొసగని బంధం: ముంబయి జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతున్నప్పటికీ.. జట్టులోని కీలక సీనియర్ ఆటగాళ్లతో హార్దిక్‌కు సత్సంబంధాలు లేవనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌లోనూ, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ సరైన మద్దతు లభించకపోవడంతో అతడు జట్టు నుండి తప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read-IPL: నేడు ఐపీఎల్ తుది పోరు.. డిఫెండింగ్ ఛాంపియన్‌తో తలపడనున్న జీటీ!

తదుపరి అడుగు ఎటు?: ముంబయి ఇండియన్స్ నుంచి బయటకు రావాలనుకుంటున్న హార్దిక్ పాండ్య తదుపరి అడుగులు ఎటువైపు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెగా వేలం లోకి వెళ్తాడా? లేక ట్రేడింగ్ విండో ద్వారా వేరే ఏదైనా ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకుంటాడా? అన్నది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయాలపై ముంబయి మేనేజ్‌మెంట్ నుండి గానీ, హార్దిక్ నుండి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News