Thursday, September 19, 2024
HomeఆటSports stars Vs Modi government: కేంద్ర ప్రభుత్వానికి క్రీడారంగ సవాళ్లు

Sports stars Vs Modi government: కేంద్ర ప్రభుత్వానికి క్రీడారంగ సవాళ్లు

భారత్ తన క్రీడా సామర్థ్యానికి తానే పరీక్ష పెట్టుకోవాలి

ఈ ఏడాది క్రీడా రంగం మీద కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. క్రీడలు కేంద్ర ప్రభుత్వ శక్తి సామర్థ్యాలకు, దూరదృష్టికి పరీక్ష పెట్టబోతున్నాయి. ఈ ఏడాది జరగబోయే క్రీడలు కేంద్రానికి పెను సవాళ్లు కాబోతున్నాయి. క్రీడలకు సంబంధించి కేంద్రం ఇక మేల్కొనాల్సి ఉంటుంది. క్రీడలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో దేశం ఎప్పుడూ ఆలస్యంగా నిద్ర లేస్తూ ఉంటుంది. క్రికెట్ రంగానికి సంబంధించినంత వరకూ గత ఏడాది చాలాకాలం పాటు బాగానే ఉన్నట్టు కనిపించింది. చివరికి వచ్చేసరికి అది వివాదాలు, వైఫల్యాలు, ఇరకాట పరిస్థితులతో ముగిసింది. ఈ కొత్త సంవత్సరంలో భారతదేశానికి సంబంధించి రెండు ప్రధాన పోటీలు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో ఒకటి అత్యంత జనాదరణ, జనాభిమానం కలిగిన పురుషుల ప్రపంచ కప్ టి-20 పోటీలు. ఇక భారతదేశం క్రీడా రంగంలో ఏ స్థాయిలో ఉందో తెలిపే పోటీలు ప్యారిస్ నగరంలో జరిగే ఒలింపిక్స్.

- Advertisement -

మొత్తం మీద ఈ ఏడాది భారతీయ క్రికెట్ బోర్డుకు ఒక పెద్ద సవాలుగా పరిణమించబోతోంది. భారత క్రికెట్ జట్టులో అత్యంత కీలక క్రీడాకారుడుగా పరిగణన పొందుతున్న రోహిత్ శర్మకు ఏప్రిల్ లో 37 ఏళ్లు నిండబోతున్నాయి. ఈ ఆల్ రౌండర్ ఆటగాడు పదవీ విరమణ వయసుకు దగ్గరగా ఉన్నాడు. ఆయన 2022 నవంబర్ నుంచి టి-20 అంతర్జాతీయ పోటీలకు దూరంగా ఉంటున్నాడు. నిరుడు జరిగిన వన్ డే
అంతర్జాతీయ పోటీల్లో ఆయన భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ, వరుసగా పది పోటీలు గెలిచిన జట్టు చివరికి రన్నరప్ గా నిలిచిపోవలసి వచ్చింది. ఇక ఇటీవలి ఐ.పి.ఎల్ పోటీల్లో ఆయన స్థానంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా చేయడం జరిగింది. విచిత్రమేమిటంటే, భారత జట్టులో మార్పులు చేయడమంటే అది భావోద్వేగభరితంగా ఉంటుందే తప్ప ఆచరణాత్మకంగా ఉండదు. ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి ముందే బి.సి.సి.ఐ భారత జట్టుకు కెప్టెన్ ఎవరన్నది నిర్ణయిస్తుందా లేదా అన్నది చూడాలి.

పోటీలకు చాలా కాలం ముందే కెప్టెన్ ను ఎంపిక చేయడం వల్ల అతను పోటీలకు సమాయత్తం కావడానికి అవకాశం ఉంటుందనే విషయం క్రికెట్ బోర్డుకు తెలుసు. భారత జట్టులోని మరో ఉన్నత స్థాయి ఆల్ రౌండర్ విరాట్ కోహ్లీ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయనకు ఇప్పటికే 35 ఏళ్లు నిండాయి. వెస్టిండీస్ లోనూ, అమెరికాలోనూ జరగబోయే టి-20 ప్రపంచ కప్ పోటీల్లో ఆయన ఉంటాడా, ఉండడా అన్న విషయం ఇంతవరకూ తేలలేదు. ఇంతకు మించిన ప్రాధాన్యం కలిగిన అంశం ఏమిటంటే, 2036లో భారత్ లో ఒలింపిక్స్ నిర్వహించడానికి భారత్ పోటీపడడం. ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ పోటీపడుతుందంటూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఒలింపిక్స్ అసోసియేషన్ సమావేశం సందర్భంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నదీ తెలియదు. దీనికి ప్రత్యేకంగా కాల గడువేమీ లేదు కానీ, భారత ప్రభుత్వం, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ కలిసి అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ తో సంప్రదించాల్సి ఉంటుంది.

దీనికి పోటీపడాలన్న పక్షంలో ముఖ్యంగా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ చొరవ తీసుకోవడం ప్రారంభించాలి. ఐ.ఒ.సి కోరినట్టుగా ఇందుకు ప్రత్యేకంగా ఒక సి.ఇ.ఓను నియమించాలి. ఇక ఒలింపిక్స్ పోటీల్లో తాము కూడా పతకాలు సాధించగలమని భారత్ నిరూపించడం అన్నిటికన్నా ముఖ్యం. ప్యారిస్ లో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో భారత్ తన క్రీడా సామర్థ్యానికి తానే పరీక్ష పెట్టుకోవాల్సి ఉంటుంది. దేశంలో వివిధ క్రీడలు అభివృద్ధి చెందాలన్న పక్షంలో కనీసం రెండంకెలలో పతకాలు సాధించడం చాలా అవసరం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఈ ఏడాది క్రీడారంగ అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News