Wednesday, April 2, 2025
HomeఆటHCA-SRH మధ్య పాసుల వివాదం.. ఉప్పల్ స్టేడియం భవిష్యత్తుపై అనిశ్చితి..!

HCA-SRH మధ్య పాసుల వివాదం.. ఉప్పల్ స్టేడియం భవిష్యత్తుపై అనిశ్చితి..!

హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య పాస్‌ల వివాదం తీవ్రమైంది. హెచ్‌సీఏ అధికారి మిగులు టిక్కెట్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని, అంతకు మించి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో SRH తమ హోమ్ గ్రౌండ్‌ను మార్చుకునే యోచనలో ఉందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, స్టేడియం నిర్వహణ హక్కుల్ని కలిగి ఉన్న హెచ్‌సీఏకి 10% కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా 50 సీట్లు ఉన్న కార్పొరేట్ బాక్స్‌ను హెచ్‌సీఏకు కేటాయించారు. అయితే, ఈ ఏడాది ఆ బాక్స్ సామర్థ్యాన్ని 30 సీట్లకు తగ్గించామని పేర్కొంటూ, అదనంగా మరో 20 టిక్కెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ డిమాండ్ చేసింది.

- Advertisement -

SRH యాజమాన్యం దీనిపై చర్చించాలని కోరగా, ఓ మ్యాచ్ సందర్భంగా హెచ్‌సీఏ అధికారులు కార్పొరేట్ బాక్స్‌కు తాళం వేశారు. చివరకు అదనంగా 20 టిక్కెట్లు ఇస్తేనే తాళం తీస్తామని హెచ్‌సీఏ నొక్కి చెప్పిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో SRH జనరల్ మేనేజర్ శ్రీనాథ్, హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావుకు లేఖ రాసినట్లు సమాచారం. గత రెండు సంవత్సరాలుగా అనేక టిక్కెట్లు ఇచ్చినా.. ఇంకా అధిక సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ ఒత్తిడి తెస్తోందని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ ఆరోపణలపై హెచ్‌సీఏ స్పష్టత ఇచ్చింది. తమకు SRH యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని, సోషల్ మీడియాలో పాకుతున్న వార్తలు అసత్యమని హెచ్‌సీఏ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. కొన్ని గుర్తు తెలియని వ్యక్తులు HCA ప్రతిష్ట దెబ్బతీసేందుకు కావాలని ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు. అంతేకాదు, ఒకవేళ SRH నుంచి ఈమెయిల్స్ వచ్చాయని ప్రచారం చేస్తుంటే, అవి అధికారిక ఈమెయిల్స్ నుంచి వచ్చాయా.. లేదా గుర్తు తెలియని మూలాల నుంచి లీక్ అయ్యాయా.. అనే అంశంపై దర్యాప్తు అవసరమని హెచ్‌సీఏ అభిప్రాయపడింది.

సీఎం రేవంత్ రెడ్డి సీరియస్: SRH యాజమాన్యంపై హెచ్‌సీఏ ఒత్తిడి తీసుకురావడం, బెదిరింపులకు పాల్పడడం వంటి ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ విషయంపై సీఎంఓ కార్యాలయం అధికారులు పూర్తి వివరాలను సేకరించారు. SRH యాజమాన్యంపై పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఒత్తిడి తెచ్చిందా? లేదా? అనే విషయంపై విచారణ జరిపించాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని సీఎం ఆదేశించారు. విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాల్సిందే. ఈ వివాదం ఇంకా ఎటువైపు వెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. SRH, ఉప్పల్ స్టేడియాన్ని వదిలి కొత్త హోమ్ గ్రౌండ్‌ కోసం వెళ్లిపోతుందా? లేక హెచ్‌సీఏతో పొత్తును కొనసాగిస్తుందా? అన్నది సమయం చెప్పాల్సిన విషయమే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News