సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్ 2025లో మరో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఓడిపోయింది. విశాఖలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, 163 పరుగులకే ఆలౌటవగా, ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ ఓపెనర్లు ఫాప్ డూప్లెసిస్, జేక్ ఫ్రేజర్ విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి విజయానికి బలమైన పునాదిని వేశారు. డూప్లెసిస్ తన దూకుడుతో కేవలం 27 బంతుల్లోనే అర్ధ శతకం (50) పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు ఉండటం విశేషం.
ఇక కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 2025లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతను కేవలం మూడు బంతులే ఆడి.. 1 ఫోర్లు, 1 సిక్సుతో వేగంగా 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మిడిల్ ఆర్డర్‌లో అభిషేక్ పరోల్ (34 పరుగులు, 18 బంతుల్లో) మరియు ట్రిస్టన్ స్టబ్స్ (21*) జట్టును విజయతీరాలకు చేర్చారు.
అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ మరోసారి నిరాశపరిచింది. ఒక్క అనికేత్ వర్మ తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. 41 బంతుల్లో 74 పరుగులతో అతడు ఒక్కడే పోరాడాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. కానీ ఇతర బ్యాటర్లు పెద్దగా సహకరించలేకపోయారు. క్లాసిన్ (26) కొంతసేపు నిలిచినా, పెద్ద స్కోరు చేయలేకపోయాడు. సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. జీషాన్ అన్సారీ ఒక్కరే మినహా మిగతా బౌలర్లు తేలిపోయారు. జీషాన్ 3 వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన కనబరిచినా, ఇతర బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.
వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోవడంతో SRH అభిమానుల్లో నిరాశ నెలకొంది. జట్టు నెగ్గాలంటే బ్యాటింగ్‌లో స్థిరత్వం, బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన అవసరమని స్పష్టమైంది. మరి SRH తమ తదుపరి మ్యాచ్‌లో గెలుపుబాట పడుతుందో లేదో చూడాలి.