Saturday, November 15, 2025
HomeఆటSRH vs LSG: లక్నోను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. మరో హై-స్కోరింగ్ మ్యాచ్‌కు ఉప్పల్ సిద్ధం..!

SRH vs LSG: లక్నోను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. మరో హై-స్కోరింగ్ మ్యాచ్‌కు ఉప్పల్ సిద్ధం..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)… లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో ఈ మ్యాచ్ జరగనుంది. SRH జట్టు గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (106 నాటౌట్), ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌ల బ్యాటింగ్ దాడితో 286 పరుగుల భారీ స్కోరు సాధించిన SRH, ఈ సీజన్‌లో అగ్రస్థానంలో ఉంది. బ్యాటింగ్ పరగంగా చూసుకుంటే ఆ జట్టు ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తుంది. SRH బ్యాటర్లు ఇదే విధంగా ఆడితే గత రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠ పోరులో ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. మిచెల్ మార్ష్ (72), నికోలస్ పూరన్ (75) అద్భుతంగా ఆడినప్పటికీ, ఆశుతోష్ శర్మ (66) విధ్వంసకర బ్యాటింగ్‌తో LSG విజయాన్ని చేజార్చాడు. రిషభ్ పంత్ నాయకత్వంలోని ఈ జట్టు ఈ ఓటమి నుంచి తేరుకుని, SRHపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. గాయం నుంచి కోలుకున్న ఆవేశ్ ఖాన్ జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ, అతన్ని నేరుగా ఆడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక పిచ్ విషయానికి వస్తే.. ఉప్పల్ స్టేడియం బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా ఉండటంతో, హై-స్కోరింగ్ గేమ్‌ను ఆశించవచ్చు. SRH బౌలింగ్ యూనిట్‌లో పాట్ కమిన్స్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా వంటి స్టార్ బౌలర్లు ఉండగా, LSG బౌలింగ్ రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్‌లపై ఆధారపడి ఉంది. అయితే, LSG బౌలింగ్ లైనప్ గాయాలతో సతమతమవుతుండటం ఆ జట్టుకు కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో SRH తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని, LSG తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గతంలో జరిగిన హైదరాబాద్ మ్యాచ్‌లో SRH 10 వికెట్ల తేడాతో గెలిచినందున, ఈసారి LSG ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా SRH తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad