ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో తొలి మ్యాచ్ ఆడేందుకు ఆరెంజ్ ఆర్మీ సిద్ధమైంది. గత ఏడాది కప్ సాధించడానికి ఒక్క ఆడుగు దూరంలో ఆగిపోయిన సన్‌రైజర్స్ ఈ సారి ఎలాగైనా ఆ కల సాకారం చేసుకోవాలని చూస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని గెలుపుతో ప్రారంభించాలనుకుంటోంది. ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని SRH టీం అన్ని విధాలుగా ధృడంగా కనిపిస్తోంది. మరోవైపు గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా టోర్నీని ఘనంగా ప్రారంభించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో SRH- RR జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్ ఓ సారి చూద్దాం.
ఇప్పటివరకు SRH vs RR జట్లు 20 సార్లు తలపడ్డాయి. ఇందులో 11 మ్యాచ్‌ల్లో SRH, 9 మ్యాచ్‌ల్లో RR గెలిచాయి. ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో 4 మ్యాచ్‌ల్లో SRH విజయం సాధించింది. ఇక గత 5 మ్యాచ్‌ల్లో SRH 3, RR 2 సార్లు విజయం సాధించాయి.
ఇక హైదరాబాద్ ఉప్పల్ పిచ్ రిపోర్ట్ చూస్తే.. ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. బంతి బ్యాట్‌పైకి సులువుగా వస్తుంది కాబట్టి బ్యాటర్లు బౌండరీలు సులభంగా కొడతారు. భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. SRH జట్టు ఆటగాళ్లపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలకు మంచి ఆరంభం లభిస్తే.. బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ సంవత్సరం ఇషాన్ కిషన్ కొత్తగా జట్టులో చేరాడు. ఇక తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వీరితో పాటు ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమీలతో SRH జట్టు ధృడంగా కనిపిస్తోంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సారి కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతోంది. రియాన్ పరాగ్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ క్లిక్ అయితే బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. మరోవైపు 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడతాడా అని అందరూ చూస్తున్నారు.
ప్లేయింగ్ ఎలెవన్ అంచనా:
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, వియాన్ ముల్డర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహమ్మద్ షమీఇంపాక్ట్ ప్లేయర్లు: జయదేవ్ ఉనద్కత్, అనికేత్ వర్మ.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, శుభమ్ దూబే, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్లు: కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, కునాల్ సింగ్ రాథోడ్.