Saturday, November 15, 2025
HomeఆటSushil Kumar:వారం రోజుల్లో లొంగిపోవాల్సిందే...సుశీల్‌ సుప్రీం ఆదేశాలు!

Sushil Kumar:వారం రోజుల్లో లొంగిపోవాల్సిందే…సుశీల్‌ సుప్రీం ఆదేశాలు!

SushilKumar Vs Supreme Court: ఒలింపిక్ పతకాలతో దేశానికి గౌరవం తీసుకొచ్చిన రెజ్లర్ సుశీల్ కుమార్‌కు సుప్రీంకోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. గతంలో ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ, ఆయన వారం రోజుల్లో అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్..

ఈ కేసు 2021లోనిది. ఆ సంవత్సరం మే నెలలో ఢిల్లీ ఛత్రసాల్ స్టేడియంలో ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్కర్, అతని స్నేహితులపై దాడి జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ దాడిలో సాగర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నివేదికలో గాయాలే మరణానికి కారణమని స్పష్టమైంది.

జ్యుడీషియల్ కస్టడీలో…

దాడి జరిగిన తర్వాత 18 రోజులపాటు సుశీల్ కుమార్ పోలీసులు కనిపించకుండా పారిపోయాడు. చివరికి ముండ్కా ప్రాంతంలో ఒక జాతీయ స్థాయి అథ్లెట్ దగ్గర నుండి నగదు తీసుకొని పారిపోతుండగా ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగిన సుశీల్ కుమార్‌ను రైల్వే శాఖ తన ఉద్యోగం నుంచి తొలగించింది.

ఢిల్లీ ట్రయల్ కోర్టు..

2022 అక్టోబర్‌లో దిల్లీ ట్రయల్ కోర్టు ఈ కేసులో సుశీల్ కుమార్‌తో పాటు 17 మందిపై అభియోగాలు నమోదు చేసింది. వీటిలో హత్య, అల్లర్లు, నేరపూరిత కుట్ర, దోపిడీ, అక్రమ ఆయుధాల కలిగి ఉండడం వంటి తీవ్రమైన నేరాలు ఉన్నాయి.ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో, మొత్తం కుట్రలో సుశీల్ కుమార్ కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నారు.

అయితే సుశీల్ కుమార్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించాడు. మూడు సంవత్సరాలకు పైగా జైలులో గడిపిన తర్వాత, తాను నిర్దోషినని చెబుతూ బెయిల్ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో 2024 మార్చి 4న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, విచారణ పూర్తికాకముందే బెయిల్ మంజూరు చేసింది.

సుప్రీంకోర్టును..

అయితే సాగర్ ధన్కర్ తండ్రి అశోక్ ధన్కర్ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ మృదుల్ వాదనలు వినిపించగా, సుశీల్ కుమార్ తరఫున సీనియర్ అడ్వకేట్ మహేశ్ జెఠ్మలానీ వాదించారు. కేసు తీవ్రత, ఆధారాలు, సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను రద్దు చేసింది.

కోర్టు తీర్పు ప్రకారం, సుశీల్ కుమార్ వారం రోజుల్లో అధికారుల ముందు లొంగిపోవాలి. లేదంటే, తదుపరి చట్టపరమైన చర్యలు తప్పవు. ఈ నిర్ణయంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఒకప్పుడు దేశానికి రెజ్లింగ్‌లో రెండు ఒలింపిక్ పతకాలను అందించిన సుశీల్ కుమార్, ప్రస్తుతం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా నిలవడం క్రీడాభిమానులను కలచివేస్తోంది. ఆయన క్రీడా ప్రస్థానం, సాధన, పేరు ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారడం క్రీడా రంగంలో పెద్ద చర్చకు దారితీసింది.

Also Read: https://teluguprabha.net/sports-news/team-india-test-captain-shubman-gill-won-icc-mens-player-of-the-month-for-july-2025/

ఈ కేసు దర్యాప్తు దశ నుంచే మీడియా దృష్టిని ఆకర్షించింది. ఛత్రసాల్ స్టేడియం ఘర్షణ, వీడియో ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, పరారీలో గడిపిన రోజులు అన్నీ ఈ కేసులో కీలకాంశాలుగా నిలిచాయి. పోలీసులు సమర్పించిన ఛార్జ్‌షీట్ ప్రకారం, ఘర్షణకు ముందు నుంచే పథకం వేసి దాడి జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సుప్రీంకోర్టు తీర్పుతో ఈ కేసు మరింత కీలక దశలోకి ప్రవేశించింది. సుశీల్ కుమార్ మళ్లీ జైలులోకి వెళ్లడం, విచారణకు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఇక ఆయనపై ఉన్న అభియోగాలు కోర్టులో నిరూపితమవుతాయా లేదా అనేది రాబోయే విచారణలలో స్పష్టమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad