సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(MI) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టుకు ముంబై బౌలర్లు షాక్ ఇచ్చారు. అరంగేట్ర బౌలర్ అశ్వనీ కుమార్ కీలకమైన 4 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దీంతో రహానే సేన కేవలం 116 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇక 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై, ఆతిథ్య బౌలర్లపై దాడి చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (62) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. చివర్లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) 27 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో సూర్య టీ20 క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 8,000 కంటే ఎక్కువ టీ20 పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో సూర్య కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా ఉన్నారు. అందరి కంటే కింగ్ కోహ్లీ 12,976 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.