ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ(Tilak Verma)ను రిటైర్డ్ ఔట్ చేయాలని ముంబై ఇండియన్స్ మేనేజెమెంట్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముంబై విజయానికి 7 బంతుల్లో 24 పరుగులు కావాల్సి ఉండగా.. తిలక్ వర్మను వెనక్కి పిలిపించింది. అతడి స్థానంలో శాంట్నర్‌ను క్రీజులో పంపించింది.
అయితే తిలక్ వర్మను వెనక్కి పిలిపించడంపై ముంబై స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తీవ్ర అసహనానికి గురి అయ్యాడు. అతడికి నచ్చజెప్పేందుకు కోచ్ జయవర్ధనే ప్రయత్నం చేశాడు. అయినా కానీ సూర్య అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అయితే చివర్లో పరుగులు రాబట్టడంతో ఇబ్బంది పడుతున్నాడని కోచ్ జయవర్ధనే ఆదేశాలతో రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయినా కానీ ముంబై ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. దీంతో ముంబై మేనేజెమెంట్ నిర్ణయంపై నెటిజన్లు, ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తిలక్ ఉండి ఉంటే మ్యాచ్ గెలిపించేవాడేమో అంటూ పోస్టులు పెడుతున్నారు.