SuryaKumar Yadav: పాకిస్థాన్‌తో పోరుకు ఓపెనర్ అభిషేక్ శర్మ సిద్ధమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధ్రువీకరించాడు. భారత్- పాక్ మ్యాచ్ అంటేనే తీవ్ర ఒత్తిడి ఉంటుందన్న సూర్య.. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ సవాల్‌కు వెరవబోమని వ్యాఖ్యానించాడు.
ఫిబ్రవరి 15 యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసే రోజు. టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల పోరులో భారత్‌ను ప్రోత్సహించేందుకు క్రికెట్ అభిమానులతో పాటు సాధారణ ప్రజలు సైతం ఎదురుచూస్తుంటారు. ఇటీవల పాకిస్థాన్ చేసిన ప్రకటనతో భారత్- పాక్ మ్యాచ్ జరగదనే అభిమానులు నిరాశలో ఉండగా.. ఐసీసీ చొరవతో ఎట్టకేలకు మ్యాచ్‌కు పాక్ జట్టు సిద్ధమైంది. టీమిండియా అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడుతున్నాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో స్కై.. ఈ విషయాన్ని ధృవీకరించాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లలో ఇప్పటివరకు ఇరు జట్లు 8 సార్లు తలపడగా, భారత్ 7 సార్లు విజయం సాధించింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో దాయాదుల సమరం జరగనుంది. కాగా, ఇటీవల అమెరికాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కడుపు నొప్పితో అభిషేక్ శర్మ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో నమీబియాతో జరిగిన గత మ్యాచ్‌కు అతను దూరం కాగా.. అతని స్థానంలో ఓపెనర్‌గా సంజూ శాంసన్ ఆడాడు. 8 బంతుల్లో 22 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇప్పుడు అభిషేక్ పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులోకి తిరిగి రావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
“రేపు భారత్- పాక్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడతాడు. ఇది సాధారణ మ్యాచ్ కాదు. ఈ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. మేం తరచుగా వాళ్లతో ఆడడం లేదు కాబట్టి ఒత్తిడి సహజం. ఇది ప్రత్యేకమైన సందర్భం. మ్యాచ్‌కి వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం మన చేతుల్లో లేదు. మంచి క్రికెట్ ఆడటమే మా నియంత్రణలో ఉంది. ఇక్కడి పరిస్థితులు మాకు అలవాటే.” అని వివరించాడు.
ఇక పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ వ్యాఖ్యలపై స్పందించిన సూర్య.. సిలబస్‌లో లేని ప్రశ్న వచ్చినా వదిలేయలేం కదా అని సమాధానమిచ్చాడు. అతనికి దాసోహం అనే ప్రసక్తే లేదని.. టీమిండియా ఈ సవాల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తోందని ధీమా వ్యక్తం చేశాడు.

