Suryakumar Yadav spirit of cricket: గెలుపు ముఖ్యం కాదని, ఆటను గౌరవించడమే పరమావధి అని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరూపించాడు. నిబంధనల ప్రకారం ప్రత్యర్థి బ్యాటర్ ఔటైనా, అప్పీల్‌ను వెనక్కి తీసుకుని గొప్ప మనసు చాటుకున్నాడు. ఆసియా కప్-2025 తొలి మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటనతో, సూర్యకుమార్ యాదవ్ ప్రతిష్ఠాత్మక ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డుకు అర్హుడంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. అసలు మైదానంలో ఏం జరిగింది…? థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించినా, కెప్టెన్ ఎందుకు కాదన్నాడు..?
అసలేం జరిగిందంటే : దుబాయ్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూఏఈ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ను ఆల్‌రౌండర్ శివమ్ దూబే వేస్తున్నాడు.
దిమ్మతిరిగే స్టంపింగ్: దూబే వేసిన షార్ట్ బంతిని ఆడేందుకు యూఏఈ బ్యాటర్ జునైద్ సిద్ధిఖీ క్రీజు వదిలి ముందుకు వచ్చాడు. బంతిని అందుకోవడంలో విఫలమవ్వగా, వికెట్ కీపర్ సంజూ శాంసన్ మెరుపువేగంతో బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్ చేశాడు.
థర్డ్ అంపైర్ తీర్పు: ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించాడు. రీప్లేలలో బెయిల్స్ ఎగిరిపోయే సమయానికి జునైద్ క్రీజులోకి తిరిగి రాలేదని స్పష్టంగా తేలింది. నిబంధనల ప్రకారం ఔట్ అని థర్డ్ అంపైర్ ప్రకటించడంతో పాటు, మైదానంలోని పెద్ద స్క్రీన్‌పై ‘OUT’ అని దర్శనమిచ్చింది.
అసలు కథ ఇక్కడే మొదలైంది : జునైద్ పెవిలియన్‌కు నడవడానికి సిద్ధమవుతున్న సమయంలో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డ్ అంపైర్‌తో ఏదో చర్చిస్తూ కనిపించాడు. క్షణాల వ్యవధిలోనే, భారత జట్టు తమ అప్పీల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఔటైన జునైద్, తిరిగి బ్యాటింగ్ కొనసాగించే అవకాశం లభించింది.
అప్పీల్ వెనక్కి తీసుకోవడానికి కారణం ఇదే : శివమ్ దూబే బంతి వేయడానికి పరిగెత్తుకొస్తున్న సమయంలో అతని నడుము నుంచి తువ్వాలు జారి కిందపడింది. ఇది బ్యాటర్ జునైద్ సిద్ధిఖీ ఏకాగ్రతను దెబ్బతీసింది. ఆ పరధ్యానంలోనే అతను క్రీజు వదిలి ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బౌలర్ తప్పిదం వల్ల బ్యాటర్‌ను ఔట్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని భావించాడు. అందుకే, నిబంధనల ప్రకారం అది ఔటైనా, నైతికంగా సరైంది కాదన్న ఉద్దేశంతో అప్పీల్‌ను వెనక్కి తీసుకుని అందరి మనసులూ గెలుచుకున్నాడు. ఆశ్చర్యకరంగా, ఈ లైఫ్ లభించినా జునైద్ సిద్ధిఖీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అదే ఓవర్‌లో దూబే వేసిన మరో బంతికి ఔటై వెనుదిరిగాడు.
కుప్పకూలిన యూఏఈ.. బౌలర్ల జోరు : ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్‌లో 3 వికెట్లతో సహా మొత్తం 4 వికెట్లు పడగొట్టి యూఏఈ పతనాన్ని శాసించాడు. శివమ్ దూబే 3 వికెట్లతో రాణించాడు. ఈ దెబ్బకు యూఏఈ కేవలం 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది.


