T20 Cricket: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో నాలుగో టీ20 మ్యాచ్‌కు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెల 14న భారత్–వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పర్యవేక్షించింది. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి ఎం. జీవన్‌రెడ్డి, స్పోర్ట్స్ పర్సన్ శశి నారాయణ్, సీఈఓ ఇంతియాజ్ ఖాన్ వివరాలు వెల్లడించారు. మ్యాచ్ కోసం మొత్తం 34 వేల టికెట్లను అందుబాటులో ఉంచగా, ఇప్పటివరకు 12 వేల టికెట్లు విక్రయించినట్లు నిర్వాహకులు తెలిపారు.
టికెట్ ధరలు రూ.750 నుంచి రూ.20 వేల వరకు నిర్ణయించారు. ఒక్కొక్కరు గరిష్ఠంగా నాలుగు టికెట్లు కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు. ప్రేక్షకుల కోసం మరో 5 వేల ఉచిత ప్రవేశ పాసులను కేటాయించారు. ఇందులో 2,500 మంది పాఠశాల విద్యార్థులకు మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించనున్నారు. సైనిక అధికారుల విద్యార్థుల కోసం 250 పాసులు కేటాయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
మ్యాచ్ కోసం రెండు కొత్త పిచ్‌లను సిద్ధం చేశారు. స్టేడియం పరిసరాల్లో సుమారు 4,500 వాహనాలు నిలిపేలా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ దీపాలు, అగ్నిమాపక భద్రత, ప్రేక్షకులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం అపోలో ఆసుపత్రులతో సమన్వయం చేసుకున్నట్లు హెచ్‌సీఏ ప్రతినిధులు తెలిపారు.

